iDreamPost

అన్నదాతలకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పండగకు ముందే 4 కొత్త ప్రకటనలు

  • Published Sep 20, 2023 | 10:13 AMUpdated Sep 20, 2023 | 10:13 AM
  • Published Sep 20, 2023 | 10:13 AMUpdated Sep 20, 2023 | 10:13 AM
అన్నదాతలకు మోదీ సర్కార్‌ శుభవార్త.. పండగకు ముందే 4 కొత్త ప్రకటనలు

ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలతో పాటు లో​క్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి విజయం సాధించిందేకు కాషాయ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు.. వారిపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్‌ ధరను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. పైగా ఏళ్ల తరబడి నానుతున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రెడీ అవుతోంది. ఇక తాజాగా అన్నదాతలపై వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. పండుగల వేళ.. రైతులకు శుభవార్త చెప్పింది. వారి కోసం 4 కీలక ప్రకటనలు చేసింది. అవి ఏంటి అంటే.

కిసాన్ లోన్ పోర్టల్

వినాయక చవితి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు న్యూఢిల్లీలో రెండు కొత్త పోర్టల్స్‌ని ప్రారంభించింది. వీటిలో ఒకటి కిసాన్ లోన్ పోర్టల్. రైతులకు రాయితీ రుణాలు.. అంటే తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు గాను ప్రభుత్వం ఈ పోర్టల్‌ని ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ లేని రైతులకు కూడా ఆర్థిక సహాయం అందించనున్నారు. రైతులు తమ ఆధార్ నంబర్‌తో ఈ పోర్టల్‌లో తమను తాము నమోదు చేసుకోగలుగుతారు. ఈ పోర్టల్‌ ద్వారా ముందుగా రైతులకు చౌక వడ్డీకి రుణం అందిస్తారు. తీసుకున్న మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తే.. ఆ తర్వాత మరింత రాయితీ లభిస్తుంది.

కేసీసీ ఇనిషియేటివ్స్

పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరిగి ప్రారంభించింది. రైతులకు రూ.3 లక్షల వరకు రుణాలు అందించడానికి కేసీసీ ఇనిషియేటివ్‌లను తిరిగి ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ కార్యక్రమాల పునఃప్రారంభం గురించి సమాచారం ఇస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కోసం ప్రభుత్వం సుమారు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.

డోర్‌ టూ డోర్‌ కేసీసీ

రైతులకు అనేక ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేటికి కూడా చాలా మంది రైతులకు దీని గురించి అవగాహన లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం.. ఎక్కువ మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను అందించడం కోసం.. ఇంటింటికీ వెళ్లి కేసీసీ గురించి ప్రచారం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం రైతుల ఇళ్లకు వెళ్లి కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో అనుసంధానం చేసేందుకు ప్రచారం నిర్వహిస్తుందని తెలిపింది.

విండ్స్ పోర్టల్

భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఇకపై వాతావరణం విషయంలో కూడా ప్రభుత్వం నుంచి రైతులకు సాయం అందనుంది. కిసాన్ లోన్ పోర్టల్‌తో పాటు, ప్రభుత్వం విండ్స్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. ఈ పోర్టల్ పూర్తి పేరు వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్(వీఐఎన్‌డీఎస్‌) దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందించడం ఈ పోర్టల్‌ ప్రధాన విధి. ఇక విండ్స్‌పోర్టల్‌ అధికారిక ప్రారంభం జూలైలోనే జరిగింది. ఈ పోర్టల్ రైతులకు వాతావరణ సంబంధిత డేటా కోసం అనలిటిక్స్ సాధనాలను అందిస్తుంది. తద్వారా వారు వ్యవసాయానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోగలరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి