iDreamPost

లాక్‌ డౌన్‌ 4.0 ఎలా ఉండబోతోంది..?

లాక్‌ డౌన్‌ 4.0 ఎలా ఉండబోతోంది..?

మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్‌ 3.0 ముగుస్తోంది. ఈ నెల 3వ తేదీన పొడిగించిన లాక్‌డౌన్‌ గడువు ఆదివారంతో ముగినుంది. అయితే లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్‌ 4.0 కు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఇటీవల జాతీనుద్ధేశించి ఐదో సారి ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ విషయం స్వయంగా చెప్పారు. అయితే లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన అధికారిక ప్రకటన 18వ తేదీ లోపు వెల్లడిస్తామని చెప్పి ఉత్కంఠకు తెరతీశారు.

లాక్‌డౌన్‌ 4.0 ఎలా ఉండబోతోంది..? అప్పటికే పలు అంశాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపులు ఇవ్వగా.. ఇకపై ఏఏ అంశాలకు మినహాయింపులు ఇస్తారు..? అసలు ఇస్తారా..? ఇవ్వరా..? లాక్‌డౌన్‌ 4.0 ఎన్ని రోజులు పాటు ఉంటుంది..? లాంటి ప్రశ్నలు ప్రజల మెదల్లోలో మెదులుతున్నాయి.

లాక్‌డౌన్‌ 4.0పై కేంద్రం ఇప్పటికే ప్రారంభించిన కసరత్తు.. దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు, రైల్వేలు అత్యంత స్వల్పంగా నడిచేందుకు అవకాశం ఉంది. రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తాజాగా జూన్‌ 30 వరకూ బుక్‌ చేసుకున్న రిజర్వేషన్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇక ప్రజలు భారీగా గూమిగూడే షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, పార్కులపై ఆంక్షలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం తప్పని సరి కావడంతో ఈ రంగాలపై నిషేధం తప్పనిసరి అనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో.. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చర్యలు ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి, పెద్ద పరిశ్రమలు పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు మరో రెండు రోజుల్లో తెరపడునుంది. లాక్‌డౌన్‌ ముగిసే ఆదివారం రోజునే లాక్‌డౌన్‌ 4.0కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి