iDreamPost

ఈ సారి మండల, జిల్లా పరిషత్‌లకూ కేంద్రం సొమ్ములు

ఈ సారి మండల, జిల్లా పరిషత్‌లకూ కేంద్రం సొమ్ములు

స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు రాబోతున్నాయి. ఇప్పటికే 3207 కోట్ల రూపాయల నిధులు పెండింగ్‌లో ఉండగా.. కొత్తగా 2020–21 ఆర్థిక ఏడాదికి గాను 15వ ఆర్థిక సంఘం సిఫారుసుల మేరకు 2625 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. మండల, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరగడమే తరువాయి ఈ నిధులు విడుదల కానున్నాయి.

2018–19, 2019–20 ఆర్థిక ఏడాదులకు గాను 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 4065.79 కోట్ల రూపాయల్లో రాష్ట్రానికి తొలి విడతగా 2018 జూన్‌లో 858.99 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. 2018 ఆగస్టులో పంచాయతీ పాలక మండళ్ల పదవీ కాలం పూర్తయి తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగలేదు. మార్చి నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. మిగిలిన 3207 కోట్ల రూపాయలు కూడా విడుదలవుతాయి.

మరో నెల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో జగన్‌ సర్కార్‌ ఉంది. ఈ రోజు లేదా సోమవారం లోపు రాష్ట్ర హైకోర్టులో రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే జరిగితే కొత్తగా వచ్చే 2625 కోట్ల రూపాయలతోపాటు పాత నిధులు 3207 కోట్లు పంచాయతీలకు దక్కుతాయి.

ఇప్పటికే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అందులో కార్యదర్శి, వీఆర్‌వో, సర్వేయర్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్‌ తదితర 13 విభాగాలకు ఉద్యోగులను జగన్‌ సర్కార్‌ నియమించిన విషయం తెలిసిందే. ఈ నిధులు విడుదల కావడం వల్ల పంచాయతీల్లో అభివృద్ధి పనులకు బీజం పడనుంది. ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉండడం వల్ల ఆయా పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది.

అంతేకాకుండా గత వేసవి సీజన్‌లో ఉత్తరాంద్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తాగునీటి కొరత తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేశారు. ఆయా పనులు స్థానికంగా ఉండే వారే చేశారు. అందుకు సంబంధించిన బిల్లులు దాదాపు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు జమ అయితే ఆ బిల్లులకు మోక్షం కలగనుంది. ప్రస్తుతం ఈ ఏడాది కూడా నీటి ఎద్దడి ప్రారంభమైంది. పాత బిల్లులు రాకుండా కొత్తగా మళ్లీ నీళ్లు తోలేందుకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈ పనులన్నీ జరగాలంటే.. ముందు పంచాయతీ ఎన్నికలు జరగాలి.

కాగా ఇప్పటి వరకు ఆర్థిక సంఘాల సిఫారుసు మేరకు కేంద్రం నిధులను పంచాయతీలకే కేటాయించేది. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫారుసు మేరకు ఈ సారి నిధులు పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించనున్నారు. పంచాయతీలకు సింహభాగం అంటే.. 70–85 శాతం, మండల పరిషత్‌లకు 10–25 శాతం, జిల్లా పరిషత్‌లకు 5–15 శాతం చొప్పున 2625 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి