iDreamPost

త్యాగాలకు పాతర..కేంద్రం వైఖరి

త్యాగాలకు పాతర..కేంద్రం వైఖరి

ఆయన చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి తినేందుకు ఉన్నా లేకున్నా దేశం యావత్తు 50 రోజుల పాటు ఇళ్లకే పరిమితం అయింది. వైద్యులు, నర్సులు పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా పై పోరాటం చేశారు. కడుపు కాలుతున్నా కన్నీళ్లు దిగమింగిన వలస కూలీలు, కార్మికులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అకస్మాత్తుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంతో సరుకు రవాణా చేసే లారీలు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. డ్రైవర్లు, క్లినర్లు అప్పుడప్పుడు దాతలు పెట్టే భోజనం తో అర్ధాకలి తో పంటి బిగువున ప్రాణాలను బిగబట్టి కరోనా పై పోరులో దృఢ సంకల్పంతో నిలిచారు.

చప్పట్లు కొట్టమంటే కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు. దేశం యావత్తు ఏకతాటిపై నిలిచి.. కరోనా పై పోరులో విలువ కట్టలేని త్యాగాలను చేసింది. దేశం చేసిన త్యాగాలకు పూచికపుల్ల కన్నా హీనమైన విలువను తాజాగా బీజేపీ ప్రభుత్వం కట్టింది. లాక్ డౌన్ ముగిసేవరకు, కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చేవరకు ప్రజా రవాణాను పునరుద్ధరించం అన్న మాట తప్పింది. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, కూలీల ప్రయోజనాలను గాలికొదిలేసిన కేంద్ర ప్రభుత్వం ధనవంతుల ప్రయోజనాలే పరమావధిగా ఏసీ రైళ్లను మాత్రమే నడిపేందుకు ఈరోజు నుంచి సిద్ధమైంది.

కరోనా కట్టడి కోసం దేశం చేసిన 50 రోజుల త్యాగ ఫలితాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తుండగా.. అదేమీ పట్టించుకోని బిజెపి ప్రభుత్వం ధనవంతుల ప్రయోజనాలే లక్ష్యంగా రైళ్లను తిప్పేందుకు సిద్ధమవడం అత్యంత విచారకరం. పేదలు, మధ్య తరగతి ప్రజలు, వలస కూలీలు, కార్మికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పోలీసులు అనుమతి, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అనేక నిబంధనలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఏసీ రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్లు ఉంటే చాలు నేరుగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని వెలుసుబాటు ఇచ్చింది. అదే టికెట్ ను చూపించి నేరుగా రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి కారులో వెళ్లొచ్చు అంటూ అనుమతి ఇచ్చింది. కూలీలు, కార్మికులు మధ్యతరగతి ప్రజల వల్ల మాత్రమే కరోనా వైరస్ వ్యాపిస్తుందా..? వీరివల్ల వ్యాపించదా..? అన్న ప్రశ్నకు బిజెపి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..?

రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా రైలు సర్వీసులు పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా రాష్ట్రాల్లో చేరుకున్న ప్రయాణికులను క్వారంటైన్ చేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పై పెట్టింది. వలస కూలీలు, కార్మికులతో ఇప్పటికే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు గా మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్, ముంబై, చెన్నై తదితర దేశంలోని 15 ప్రధాన నగరాల మధ్య రానుపోను 30 రైళ్ల సర్వీసులను ప్రభుత్వం నడపాలని నిర్ణయించి వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు మార్గం వేసింది. ఈ ఒక్క నిర్ణయం చాలు 50 రోజుల దేశం త్యాగాలు మట్టిలో కలిసి పోయినట్లే.

బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో రైళ్లలో భారతీయులు కేవలం మూడో తరగతి ప్రయాణాలు మాత్రమే చేయాలి అన్న నిబంధన ఉండేది. బ్రిటిషర్లు చూపే వివక్ష వల్ల భారతీయులకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ బోగిలలో ప్రయాణం చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుత బీజేపీ పాలనలో నాటి బ్రిటిషర్ల పాలనా విధానాలు కనిపిస్తున్నాయి.

ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లు సహా ఏ ఇతర రైళ్ల సర్వీసును పునరుద్ధరించని బిజెపి ప్రభుత్వం.. కేవలం ఏసీ రైళ్లను మాత్రమే పట్టాలు ఎక్కించడం వెనుక వారి మార్క్ పాలనకు అద్దం పడుతోంది.

పైగా సామాన్యులకు అందుబాటులో లేకుండా వీటిలో టిక్కెట్లు ఐ ఆర్ సి టి సి సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టింది. ఐ ఆర్ సి టి సి ఏజెంట్ల ద్వారా కూడా బుక్ చేసుకోవడానికి వీలు లేదని తెలిపింది. అంటే కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండి, టికెట్ బుక్ చేసుకునే అవగాహన ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కౌంటర్ లో టిక్కెట్లు విక్రయించకూడదని, ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవడం పై నిషేధం పెట్టి సామాన్యులపై వివక్ష చూపింది.

స్వాతంత్ర్యం అనంతరం సమానత్వం కోసం మనకు మనం రాసుకున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ను తుంగలో తొక్కింది. సమానత్వం కేవలం రాతల్లోనే ఉంటుందని మరో మారు చెప్పింది. ఇప్పుడు దేశ ప్రజల ముందు ఉన్న మార్గం ఒక్కటే.. కరోనా నుంచి ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవడమే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి