iDreamPost

నేడు రామతీర్థానికి చంద్రబాబు !! చల్లారిన సమస్యను మళ్లీ రేపేందుకేనా ??

నేడు రామతీర్థానికి చంద్రబాబు !! చల్లారిన సమస్యను మళ్లీ రేపేందుకేనా ??

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లా రామతీర్థం రానున్నారు . ఇటీవల గ్రామంలోని బోడికొండ పై ఉన్న కోదండ రామాలయంలోని శ్రీ రాముని విగ్రహం ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఆ రోజు రాముని శిరస్సును ఖండించిన దుండగులు ఆ శిరస్సుని మాయం చేశారు .

దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రాంతీయ సంయుక్త సంచాలకులు భ్రమరాంబ సారధ్యంలో విచారణకు ఆదేశించడం, ఆ వెనువెంటనే వివిధ శాఖల వారు ఘటనాస్థలికి చేరి అన్వేషణ ప్రారంభించగా సమీపంలోని కోనేరులో స్వామివారి శిరస్సు లభ్యమైంది . ఘటన జరగ్గానే టీడీపీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆఘమేఘాల మీద రామతీర్థం గ్రామానికి వచ్చి అకృత్యానికి పాల్పడింది ఎవరో విచారించమని డిమాండ్ చేయటం వదిలేసి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేశారు, మరుసటిరోజు పాదయాత్రలు చేపట్టి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ప్రణాళికలు రూపాందించారు. అయితే ఈ లోగానే రామయ్య శిరస్సు కొలనులో లభ్యమవడం , ఈ అకృత్యానికి పాల్పడిన వారెవరో సత్వరం విచారించి కఠిన చర్యలు తీసుకొమ్మని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో పరిస్థితి కాస్త ప్రశాంతంగా మారింది. దీంతో చేతిలోని ముద్ద జారిపోయినట్లుగా టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి, అందుకే నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు.

కోవిడ్ ప్రమాదం పొంచి ఉన్నందున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు సైతం కార్యకర్తలు ఎవరూ తన వద్దకు రావద్దని, అందరికీ తానే శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు విజయనగరం జిల్లా రామతీర్థం రావడానికి ప్రయాణం కట్టారు . తనకు రాజకీయ ప్రయోజనం కలగే అవకాశం ఉంటే ఎక్కడికైనా ఎంతటి ప్రమాదకర పరిస్థితులున్నా వెనుకాడేది లేదని, తనకు అవకాశవాదమే ముఖ్యమని చంద్రబాబు ఈ నిర్ణయంతో మరోసారి చెప్పకనే చెప్పారు.

మేలో విశాఖలో ఎల్జి పాలిమల్స్ కంపెనీలో గ్యాస్ లీకై 14 మంది మరణించగా ఆ తరువాత విశాఖ వచ్చిన చంద్రబాబు వెంకటాపురం వెళ్లకుండానే కేవలం జూమ్ లో విజయవాడ మంచి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తరువాత కూడా రాష్ట్రంలో రమేష్ హాస్పిటల్ దుర్ఘటన సహా పలు ప్రమాదాలు జరిగి పలువురు మరణించినా ఎక్కడా చంద్రబాబు ఆచూకీ లేదు . కానీ ఇప్పుడు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం కానున్నందున ఇలాంటి వాటిని వివాదాలుగా మలచి లబ్ది పొందడంలో నేర్పరి అయిన చంద్రబాబు ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావించి ఇక్కడికి వస్తున్నట్లు అర్థం అవుతోంది.

శ్రీరాముని విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసి యధావిధిగా పూజాక్రతువులు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సైతం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెతుకులాట ముమ్మరం చేశారు. బీజేపీ నాయకులు సైతం ప్రభుత్వ చర్యలను గమనించి తమ మాటల వాడిని, వేడిని తగ్గించారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు వచ్చి ఇక్కడ ఏం చూస్తారు. ఆ గుట్ట మీదకు ఎక్కి ఏం పరిశీలిస్తారు, ఇదంతా కేవలం చల్లారిపోయిన భావోద్వేగాలను మళ్లీ రెచ్చగొట్టడానికే అన్నది సాధారణ ప్రజానీకానికి సైతం అవగతం అవుతోంది. తల్లికి పట్టెడు మెతుకులు పెట్టని చంద్రబాబు పిన్నమ్మకు బంగారుగాజులు చేయించడం అంటే ఇదే.

పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయిన ఘటనల్లో కూడా అక్కడికి వెళ్లని చంద్రబాబు ఇప్పుడు ఇక్కడ వస్తున్నది ప్రజలను రెచ్చగొట్టేందుకే తప్ప ఇంకెందుకూ రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం గాని అనుమతిచ్చినట్లయితే చంద్రబాబు రావడం తధ్యం.. ఒకవేళ ఆయన పర్యటన శాంతిభద్రతలకు విఘాతం ఆని గానీ ప్రభుత్వం భావిస్తే చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టు నుంచే వెనక్కి పంపేసే అవకాశాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి