iDreamPost

గురువింద నీతులు చెప్పే బాబు గారు.. ఏ సారి ఇటు చూడండి..

గురువింద నీతులు చెప్పే బాబు గారు.. ఏ సారి ఇటు చూడండి..

చంద్రబాబు చేసే కరోనా రాజకీయాలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. దానికి తానా తందానా అనే మీడియా ఉండనే ఉంది. హైదరాబాద్‌లోని ఇంట్లో కూర్చున్న ఆయన.. రోజూ గంటల కొద్దీ ఆన్‌లైన్‌ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వంపై విషయం చిమ్మడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చేస్తున్న విమర్శలను పరిశీలిస్తే కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆయన కంటగింపుగా మారాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని, గుంపులుగా వెళ్లి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగిన పనిని ప్రభుత్వానికి ఆపాదించి పబ్బం గడుపుకుంటున్నారు. గవర్నర్‌కు ఫిర్యాదులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఇది ఆయన గురువింద నీతికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు.

జిల్లాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు టీడీపీ అభ్యర్థులు కరోనా సాయం పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. విశాఖ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా రేసులో ఉన్న పీలా శ్రీనివాస్‌ అయితే ఏకంగా పాంప్లెట్లు అతికించి మరీ సరుకులు అందిస్తున్నారు. భీమిలో పోటీ చేసి ఓడిపోయిన సబ్బం హరి.. దగ్గరుండి మరీ ఆ నియోజకవర్గ సర్పంచ్,ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో వస్తువులు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పంపిణీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుంపులుగా వెళ్లి లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ బొమ్మలు, తెలుగుదేశం రంగులతో సరుకులు అందిస్తున్నారు. పుట్టపర్తిలోనూ పల్లె రఘునాథరెడ్డి బొమ్మలతో టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు.

విజయవాడ మేయర్‌ అభ్యర్థి, ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత తన అభ్యర్థిత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పసుపు రంగు మాస్కులను పంపిణీ చేస్తూ తమ నైజాన్ని చాటుకుంటున్నారు. ఇలా దాదాపు అన్ని చోట్లా టీడీపీ నాయకులు కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు.

టీడీపీ నాయకులు చేస్తున్న కోడ్‌ ఉల్లంఘనలకు కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులపై వేస్తున్నట్లు అర్థం అవుతోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం తలమునకలై ఉంటే చంద్రబాబు ఆ లక్ష్యాన్ని నీరు గార్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి