iDreamPost

ప్రతిపక్షంలో ఉంటేనే విలువలు, మీడియా స్వేచ్చ గుర్తుకువస్తుందా ?

ప్రతిపక్షంలో ఉంటేనే విలువలు,  మీడియా స్వేచ్చ గుర్తుకువస్తుందా ?

చంద్రబాబునాయుడుది విచిత్రమైన మనస్తత్వం. ప్రతిపక్షంలో కూర్చున్నపుడే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎక్కడలేని విలువలు గుర్తుకువస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణే ట్విట్టర్లో పత్రికా స్వేచ్చ గురించి చంద్రబాబు చేసిన పోస్టింగే. పత్రికా స్వేచ్చకు ఎప్పుడు ముప్పు వచ్చినా ముందుండి పోరాటం చేసేది తెలుగుదేశంపార్టీనే అంటూ సొంత డప్పు బాగానే కొట్టుకున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో వచ్చిన 938 జీవోకు, జగన్మోహన్ రెడ్డి హయాంలో విడుదలైన 2430 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు కూడా చంద్రబాబు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే రాష్ట్రంలో మీడియా వ్యవస్ధకు గ్రహణం పట్టటానికి కారణం చంద్రబాబే. చంద్రబాబు సిఎం అయ్యేవరకు మీడియా మీద పెద్దగా ఆరోపణలు లేవు. చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీయార్ ప్రభుత్వాల్లో జరిగిన తప్పుల మీద నిర్భయంగా కథనాలు రాసిన చరిత్ర మీడియాకుంది. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి చంద్రబాబు వచ్చిన దగ్గర నుండి మీడియా స్వేచ్చకు అర్ధాలు మారిపోయింది. అప్పటి వరకు మీడియా స్వేచ్చంటే జర్నలిస్టుల స్వేచ్చే. కానీ చంద్రబాబు హయాంలో మాత్రం మీడియా స్వేచ్చంటే యాజమాన్యాల స్వేచ్చగా మారిపోయింది.

తన పాలనపై మీడియాలో వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకోవటంలో భాగంగా మీడియాలోని ఉన్నతస్ధాయి వ్యక్తులతో పాటు యాజమన్యాలతో కూడా సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. మొన్న వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిలను ప్రలోభాలకు గురిచేసినట్లే తనపై వ్యతిరేక వార్తలు రాకుండా యాజమాన్యాలు, కీలక వ్యక్తులను లోబరుచుకున్నాడనే విషయాన్ని కొందరు సీనియర్ పాత్రికేయులు ఇప్పటికీ చెబుతుంటారు. కారణాలేవైనా మెజారిటి మీడియా చంద్రబాబు చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయింది వాస్తవం.

సరే ఎప్పటి విషయాలో ఎందుకనుకుంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్ మీడియా ఎక్కడైతే ఫెయిలైందో అక్కడే సోషల్ మీడియా రంగంలోకి దిగింది. చంద్రబాబు, లోకేష్ పాలనా విషయాల్లోని లోపాలను సోషల్ మీడియాలో దుమ్ము రేగిపోయేవి. దాన్ని తట్టుకోలేక ఎంతోమందిని చంద్రబాబు అరెస్టులు కూడా చేయించాడు. ప్రతిపక్షంలో ఉన్నపుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాక్షి మీడియాను ప్రెస్ మీట్లకు అనుమతించని విషయం అందరికీ తెలిసిందే. తనకు ఇష్టంలేని ప్రశ్నలు ఎవరు వేసినా సహించలేని చంద్రబాబు కూడా పత్రికా స్వేచ్చ గురించి మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

అధికారంలో ఉన్నపుడు మీడియాను భ్రష్టుపట్టించి, సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపిన ఇదే చంద్రబాబు ఇపుడు మీడియా స్వేచ్చగురించి మాట్లాడటం విచిత్రం కాకపోతే మరేమిటి ? అందుకే అంటుంటారు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చినపుడు మాత్రమే విలువల గురించి, మీడియా స్వేచ్చ గురించి తెగ మాట్లాడేస్తుంటాడని. పత్రికా స్వేచ్చ దినోత్సవం రోజున చంద్రబాబు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇందులో భాగమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి