iDreamPost

21 రోజుల లాక్ డౌన్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది ?

21 రోజుల లాక్ డౌన్  ఎంత వరకు సక్సెస్ అవుతుంది ?

నిన్న అర్ధరాత్రి నుండి ఏప్రిల్ 14 వరకూ యావత్ భారత దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు భారత ప్రధాని మోడీ ప్రకటించాక ప్రజల్లో కలవరం మొదలైంది . ఏంటి పరిస్థితి , అన్నాళ్లు ఉండగలమా లాంటి ప్రశ్నలతో పాటు పలు సందేహాలు , నిత్యావసరాలు , అత్యవసర స్థితుల్లో ఎం చేయాలి అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వసాగాయి .

ఈ జాతీయ లాక్ డౌన్ కి ముందు ఆంధ్రా , తెలంగాణా రాష్ట్రాలు ఈ నెల ముప్పై ఒకటి వరకూ లాక్ డౌన్ ప్రకటించినప్పుడు అత్యవసర పరిస్థితులు , నిత్యావసరాల గురించి కొన్ని సూచనలు చేశారు కానీ సమగ్ర విధానాలు ప్రకటించలేదనే చెప్పాలి . ఇహ నిన్న రాత్రి మోడీ గారి ప్రసంగంలో నిత్యావసరాల కొరత రానివ్వము అని చెప్పారు కానీ , వాటిని ప్రజలెలా సేకరించుకోవాలో విధి విధానాలు కేంద్రం విడుదల చేయలేదు . నిర్దిష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి .

ఇప్పుడు ప్రజలు మెడిసిన్ , హాస్పిటల్ లాంటి అవసరాల కోసం ఎం చేయాలి , ఏ ఏ జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి , రవాణా సదుపాయాలు నిలిపివేసిన ఈ సమయంలో అత్యవసరంగా బయటికి వెళ్ళవలసి వస్తే హెల్ప్ లైన్స్ లాంటివి ఏర్పాటు చేస్తారో లేదో చెప్పలేదు . ఈ నిత్యావసరాల కొనుగోలుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా వ్యాపార వర్గాల సహకారం తీసుకొని రద్దీ లేకుండా ఏరియాల వారీగా టైమింగ్స్ కేటాయించి సోషల్ డిస్టన్స్ పాటిస్తూ కొనుగోలు చేసుకొనే వెసులుబాటు కల్పించవచ్చు ఆ ప్రయత్నాలు లేకుండా 21 గంట నిర్బంధంలో ఉంచి మూడు గంటలు ఫ్రీగా వదిలేస్తే జనాలు అవగాహనా లోపంతో తమకు కావాల్సినవి దొరకవు అనే భయంతో గుంపులుగా ఎగబడినందున లాక్ డౌన్ లక్ష్యం దెబ్బతిని వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉంది . ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని వ్యాపార వర్గాలను సంప్రదించి ఏరియాల వారీగా నిర్దిష్ట సమయాల్లో సోషల్ డిస్టన్స్ పాటిస్తూ కొనుగోలు చేసుకొనే వెసులుబాటు , రవాణా విధానాలు రూపొందించి అమలు చేయాలి .

సగటు భారతీయుడు అత్యావశ్యకంగా భావించే పాలు , పెరుగు లాంటి వాటి కోసం ఎవరి పై ఆధారపడాలి , మొదట వారం రోజులు లాక్ డౌన్ అనుకోని సిద్ధపడిన ప్రజలు , ఈ 21 రోజుల లాక్ డౌన్ కి సిద్ధపడలేదు అనే మాట వాస్తవం . ప్రతి నెలా జీతభత్యాలని అనుసరించి 1 వ తారీఖు నుండి 10 వ తారీఖు వరకూ నెలవారీ కిరాణా సరుకులు , దీర్ఘకాలిక వ్యాధుల మెడిసిన్ కొనుగోలు చేసే భారతీయులు ఈ లాక్ డౌన్ తర్వాత తమ జీతాలు వస్తాయా రావా అనే భయాందోళనలకు గురయ్యే మాట వాస్తవం , సంఘటిత వ్యాపారాల్లో కాకుండా , చిన్న , మధ్యస్థ వ్యాపారుల వద్ద నుండి జీతాలు అందుతాయా అంటే అనుమానమే , దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించినా అసంఘటిత వ్యాపార రంగాలు లేబర్ రిజిస్ట్రేషన్స్ లో ఉద్యోగుల నమోదుని చూపించని వ్యాపారస్తులు ఇవి పాటించారు అనేది నగ్న సత్యం .

వీరికి తగిన ఆర్ధిక సహాయం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రకటించాలి , సాధారణ స్థితిలో BPL పరిధిలో ఉన్న ప్రజల పట్ల చూపించే శ్రద్ధ , కల్పించే వసతులు ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వం కల్పించాలి . లేని పక్షంలో వీరు తమ నిత్యవసరాలకే కాక , ఆర్ధిక వనరులకు కూడా అన్వేషణ సాగించటానికి లాక్ డౌన్ ఉల్లంఘించే అవకాశం ఉంది . ఇహ ఎవరైనా రోగం బారిన పడితే హాస్పిటల్ కి నలుగురు తోడుతో బయలుదేరే సంస్కృతి మనది అలా కాకుండా రోగిని మాత్రమే హాస్పిటల్ చేర్చి వైద్యం ఆహార వసతి కల్పించకపోతే వీరి కోసం లాక్ డౌన్ నిబంధనలు సడలించాలి లేదా వారు అతిక్రమించాలి . ఈ దిశగా కూడా సహాయం చేసే మార్గదర్శకాలు ప్రకటించాలి .

ఈ లాక్ డౌన్ మూలంగా అత్యంత నష్టానికి గురయ్యేది వ్యవసాయ రంగం . ఏడాది పాటు శ్రమించిన రైతుకు మరుసటి యాడాది మొత్తానికి గ్రాసం ఇప్పుడు చేతికొచ్చే పంటే . వారికి అత్యంత కీలక సమయం ఇది . దీర్ఘ కాలం నిల్వ ఉండే ఆహార , చిరు ధాన్యాలు , పత్తి , మిర్చి లాంటి వాణిజ్య పంటలు నిల్వ చేసుకొని లాభానికో , నష్టానికో తర్వాత అమ్ముకొనే వెసులుబాటు ఉన్నా , ప్రస్తుతం నిల్వ చేసుకోవటానికి తరలించే వెసులుబాటు , ఈ ఉత్పత్తుల పై తక్షణ రుణ సౌకర్యం కల్పిస్తే 60 శాతం సమస్య తొలగుతుంది .

ఇహ కాయలు , కూరగాయలు , ఆకు కూరలు , లాంటి నిల్వ ఉండని నిత్యావసర పంటలు , గుడ్లు లాంటి ఉప ఉత్పత్తులు పల్లెటూరి నుండి టౌన్స్ కి చేరే రవాణా మార్గాలు వైరస్ చేరకుండా క్లీన్ చేసే పద్ధతులు , మార్కెట్స్ , రైతు బజార్ల ద్వారా నిఘా నీడన నియమిత వేళల్లో సురక్షిత ఆరోగ్య సూచనలు పాటిస్తూ , సోషల్ డిస్టన్స్ మైంటైన్ చేస్తూ సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేస్తే అటు రైతులకు , ఇటు ప్రజలకు అవసరాలు తీరుతాయి .

అంతిమంగా లాక్ డౌన్ అనేది కఠినమైనా శరవేగంగా వ్యాపించే కరోనా వైరస్ కట్టుదిట్టం చేయడం కోసం మంచి నిర్ణయమే , అయితే ప్రజల అత్యవసరాలు , నిత్యావసరాల కోసం పైన ఉదహరించిన కొన్ని వెసులుబాట్లు సురక్షిత పద్దతిలో , నియమిత వేళలు పాటిస్తూ కల్పించాలి , సోషల్ డిస్టన్స్ పట్ల మరింత అవగాహన కల్పించాలి అనేది మాత్రం సత్యం .

ప్రస్తుతం కరోనా వ్యాపించిన దేశాల గణాంకాల ప్రకారం మన దేశ స్థితి అంచనా వేస్తున్న కొన్ని సంస్థలు 10 నుండి 20 కోట్ల మందికి వైరస్ సోకవచ్చని కోటి వరకూ మరణాలు ఉండవచ్చని అంచనాలు వేస్తున్నాయి . అది జరగకుండా ఉండాలంటే లాక్ డౌన్ ఒక్కటే ప్రత్యామ్నాయం కాబట్టి కష్టతరమైనా మనమందరం పాటించక తప్పని స్థితి .

ఒక వ్యక్తిని ఐషోలేషన్ లో ఉంచితే ఎంత ఖర్చు అవుతుందో కానీ అంతర్జాతీయ అంచనాల ప్రకారం 10 కోట్ల మందికి కరోనా సోకితే మోడీ ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయం ఒక్కో వ్యక్తికి 1500 రూపాయలు , ఇరవై కోట్ల మందికి వ్యాపిస్తే 750 రూపాయలు అది సగటు పేషంట్ ని అంబులెన్స్ లో ఐషోలేషన్ వార్డ్ కి తీసుకెళ్ళటానికి చాలదు .

అత్యంత జనసాంద్రత కలిగిన మన దేశంలో నిత్య పరిపాలనావసరాలు తప్ప కరోనా వైరస్ లాంటి జాతీయ విపత్తులు సంభవిస్తే దేశ ప్రజల కోసం ప్రభుత్వాలు ఏ మేరకు అడ్డుకోగలవు . ఎంతవరకూ సహాయం చేయగలవు అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వాల చిత్తశుద్ధి విషయాన్ని పక్కన పెడితే ఎంతవరకూ అవకాశం ఉన్నది అన్న విషయాన్ని ఆలోచిస్తే మన జనాభా నిష్పత్తిలో సమస్య తీవ్రత పెరిగితే ఏ ప్రభుత్వమూ కాపాడే పరిస్థితి లేదు . కేవలం ఆరుకోట్ల జనాభా ఉండి , అత్యంత అధునాతన వైద్య సౌకర్యాలున్న ధనిక దేశం ఇటలీనే ఏమీ చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి .

మీరే నిర్ణయించుకోండి బయట తిరిగి వైరస్ వస్తే ప్రభుత్వం చేసే నామమాత్రపు ఖర్చులతో , సమస్య తీవ్రత పెరిగి ప్రభుత్వాలు చేతులెత్తేసే స్థితికి పోయి బతకగలరా లేక 21 రోజులు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకుండా బతికి బయట పడాలా అనేది . సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించుకొంటా అనుకొంటారేమో ఆ అవకాశం కూడా లేదు .

నేను బతకాలి నా కుటుంబాన్ని బతికించుకోవాలి అని దృఢ సంకల్పం ఉంటే లాక్ డౌన్ సక్సెస్ అవుతుంది . కరోనా వైరస్ బారినుండి నిన్నూ నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు . సంకల్పించుకోండి , పాటించండి బతికి బయట పడండి , సమాజాన్ని కాపాడండి . ఇది మోడీ చేతిలోనో , కేసీఆర్ చేతిలోనో , జగన్ చేతిలోనో పని కాదు నీ చేతిలో నా చేతిలో మన చేతుల్లో ఉన్న బాధ్యత .

21 రోజుల లాక్ డౌన్ పాటించి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి , తప్పనిసరిగా బయటకు వస్తుంటే మాస్క్ వేస్కోని రండి , శానిటైజర్ , లేదా సబ్బుతో చేతులు కడుక్కోకుండా మొహం పై చేతులు తాకించకండి .దగ్గు తుమ్ము వస్తే మొహానికి మోచేయి అడ్డం పెట్టుకోండి . సాటి వ్యక్తులకు ఒక మీటర్ దూరం ఉంటూ సోషల్ డిస్టన్స్ పాటించండి . లాక్ డౌన్ ని విజయవంతం చేయండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి