iDreamPost

నేడు మంత్రి వర్గ సమావేశం.. మరో ముఖ్యపథకానికి పచ్చజెండా ఊపనున్న మంత్రిమండలి

నేడు మంత్రి వర్గ సమావేశం.. మరో ముఖ్యపథకానికి పచ్చజెండా ఊపనున్న మంత్రిమండలి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు గురువారం జరగనుంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లోని సమావేశమందిరంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. దాదాపు రెండున్నర నెలల తర్వాత మంత్రి వర్గం భేటీ కాబాతోంది. సాధారణంగా ప్రతి నెల మొదటి, చివరి బుధవారాల్లో ఏపీ మంత్రివర్గం సమావేశం అయ్యేది. అయితే కరోనా వల్ల దీనికి ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 40 అంశాలతో జంబో అజెండా మంత్రివర్గం ముందుకు రాబోతోంది.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ అమలు చేయబోయే సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే అమలు చేసిన పథకాలతోపాటు నూతన పథకాలు ఉన్నాయి. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఒక్కొక్కరికి ఏడాదికి 18,750 రూపాయలు చొప్పున నాలుగేళ్లకు 75 వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఎన్నికల హామీల్లోని ఈ పథకం ఈ ఏడాది ఆచరణలో తెచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

వివిధ అంశాలతోపాటు ఈ నెల16వ తేదీన ప్రారంభం కాబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సమావేశాలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చకు తీసుకురావాలనే అంశంపై కూడా మంత్రివర్గం సమాలోచనలు జరపనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి