iDreamPost

తెలంగాణలో రూ. 400కే గ్యాస్ సిలిండ‌ర్ : సీఎం కేసీఆర్

  • Published Oct 16, 2023 | 10:42 AMUpdated Oct 16, 2023 | 10:42 AM
  • Published Oct 16, 2023 | 10:42 AMUpdated Oct 16, 2023 | 10:42 AM
తెలంగాణలో రూ. 400కే గ్యాస్ సిలిండ‌ర్ : సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎన్నికల హామీల మోత మొదలైంది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడం, నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉండబోతుందని సీఈసీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని అధికార బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. మరోవైపు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చే పనిలో బీజేపీ, కాంగ్రెస్ లు పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ – ఫారాలు కూడా ఇచ్చారు. హుస్నాబాద్ లో ప్రచారం షురూ చేశారు. 

తెలంగాణ భవన్ లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. 2023 ఎన్నికల్లో మరోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రచారానికి నాంది పలికారు. అంతకు ముందు తెలంగాణ భవన్ లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సామాన్యులపై ఎన్నో వరాల జల్లులు కురిపించారు. ముఖ్యంగా మహిళల కోసం కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు మేనిఫెస్టోలో తెలిపారు.

ఇప్పటికే ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు అమలు చేస్తుండగా.. మూడోసారి అధికారంలోకి వస్తే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా బీపీఎల్ కార్డులు ఉన్న మహిళలకు ప్రతి నెలా 3 వేల రూపాయల జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అలానే వంట గ్యాస్ విషయంలో మహిళల బాధను కూడా తీరుస్తామని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు.400 రూపాయలకే సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు కూడా వారి ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

కొంత కాలంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని.. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినా గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ కట్టెల పొయ్యి, గొట్టాలు పట్టుకునే పరిస్థితి వచ్చిందని.. ఈ బాధ పోవాలని.. మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు. మరి అధికారంలోకి వస్తే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి