iDreamPost

ఇంప్లాంట్స్‌ క్రేజ్‌.. సర్జరీల సంఖ్య రెట్టింపు..

ఇంప్లాంట్స్‌ క్రేజ్‌.. సర్జరీల సంఖ్య రెట్టింపు..

ఆకృతిపై ఆరాటం.. ఫిట్ నెస్ పై పోరాటం.. ఇవే నేటి యువతకు మెదడులో తొలుస్తున్న నిరంతర ప్రశ్న.. లోపం పెద్దదైనా సరే.. చిన్నదైనా సరే.. దాన్ని తొలగించుకోవాలని వీలైనంత బాగా కనపడాలనే ఆరాటం అంతకంతకూ పెరుగుతోంది. అందులో భాగంగానే అందాన్ని పెంచే రొమ్ము ఇంప్లాంటేషన్‌ సర్జరీలకూ సిటీ యువతులు సై అంటున్నారు.

నెలకు గరిష్టంగా 25 నుంచి 30 వరకు ఈ రకమైన ఇంప్లాటేషన్‌ సర్జరీలు సిటీలో జరుగుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు కారణమయే శారీరక లోపాల్ని పంటిబిగువున భరించే కంటే వ్యయ ప్రయాసలకోర్చి అయినా తొలగించుకోవడమే మేలనే ఆలోచనా ధోరణి ఆధునికుల్లో కనపడుతోంది.

ఆర్ధిక స్వాతంత్య్రం మహిళలకు కల్పించిన వెసులుబాటు కూడా దీనికి తోడవుతోంది. అందంతో పాటు ఇది ఆత్మవిశ్వాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మానసిక సమస్యలకు ఈ సర్జరీ ఒక పరిష్కారంగా చెబుతున్నారు.

శరీరాకృతి ఒక తీరును సంతరించుకునే టీనేజ్‌లో ఈ తరహా సర్జరీలకు దూరంగా ఉండడం మేలు. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాతే అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. అదే విధంగా 50ఏళ్లు దాటిన వారు కూడా దూరంగా ఉండడమే మేలు. అందం ఒకటే కాకుండా శారీరక సమస్యలకు, ఇక కేన్సర్‌ చికిత్సలో భాగంగా రొమ్ము కోల్పోయిన వారికి కూడా ఈ ఇంప్లాంట్స్‌ ప్రయోజనకరం కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ శస్త్ర చికిత్సల గురించిన పలు అంశాలను గుర్తుంచుకోవాలని వైద్యులంటున్నారు.

కొన్ని సూచనలు..
► రొమ్ములకు అమర్చే ఈ ఇంప్లాంట్స్‌కి 10 నుంచి 15 ఏళ్ల వరకూ వారంటీ ఉంటుంది. అయితే రెండేళ్లకు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారా ఇంప్లాంట్‌ స్థితిగతులను పరీక్ష చేయించుకోవాలి.
► చాలా సహజమైన రీతిలో అమరిపోయే ఈ ఇంప్లాంట్‌ అత్యంత అరుదుగా మాత్రం అమర్చిన కొంత కాలానికి కొందరిలో చాలా గట్టిగా మారుతుంది. దీన్ని బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌ ఇల్‌నెస్‌ అంటారు. ఇలాంటి అలర్జీక్‌ రియాక్షన్‌ పరిస్థితిలో అమర్చిన ఇంప్లాంట్‌ను తొలగించుకోవడమే పరిష్కారం. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.
► ఈ ఇంప్లాంట్స్‌ అన్నీ యూరోపియన్‌ దేశాల నుంచీ దిగుమతయ్యే అమెరికన్‌ బ్రాండ్స్‌.
► స్వల్ప వ్యవధిలోనే పూర్తయే ఈ శస్త్రచికిత్సకు దాదాపుగా రూ.2 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. సర్జరీ పూర్తయిన 2 గంటల్లోనే ఆసుపత్రి నుంచీ డిశ్చార్జ్‌ అయిపోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి