iDreamPost

ఆర్మీలో చేరాలని అతని లక్ష్యం.. కానీ అరుదైన వ్యాధి పీడించింది.. ఆరునెలల్లో..

ఆర్మీలో చేరాలని అతని లక్ష్యం.. కానీ అరుదైన వ్యాధి పీడించింది.. ఆరునెలల్లో..

ఆర్మీలో చేరి, దేశ సేవ చేయాలన్నది అతని కల. ఆశయం కూడా. కానీ.. అతని కలలను వెక్కిరిస్తూ ఊహించని అరుదైన వ్యాధి వచ్చిపడింది. అయినా డీలా పడిపోలేదు. తాను సాధించగలనన్న నమ్మకంతో.. ఆ వ్యాధిని కూడా జయించాడు. ఎట్టకేలకు తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. జమ్మూకి చెందిన బాబా డానిష్ లాంగర్ (21) కథ ఇది. ఆర్మీలో చేరాలని డానిష్ చిన్ననాటి నుంచే కలలు కనేవాడు. అందుకు తగ్గట్టుగానే అతను అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు. కానీ.. 2017లో గ్విలియన్ బారే సిండ్రోమ్ (GBS) అనే ఊహించని అరుదైన వ్యాధితో అతను పక్షవాతానికి గురయ్యాడు.

గ్విలియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి ఒక్కటే చికిత్స. రక్తమార్పిడి ద్వారా మాత్రమే ఆ వ్యాధి నయమవుతుంది. తనకు అరుదైన వ్యాధి వచ్చిందని డానిష్ డీలా పడిపోలేదు. దానికి ఎదురొడ్డి పోరాడాడు. తను అనుకున్నలక్ష్యాన్ని చేరుకున్నాడు. జూన్ 11 శనివారం ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. డానిష్ సంకల్పానికి ఫిదా అయిన తోటి యువ క్యాడెట్ లో తమ టోపీలను గాల్లోకి విసురుతూ అభినందించారు. డానిష్ ఇప్పుడొక ఆర్మీ అధికారి.

డానిష్ గురించి.. అతని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. భారత ఆర్మీ సైన్యంలోకి రావడానికి డానిష్ ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. తనకు వచ్చిన వ్యాధిని ఏ మాత్రం లెక్కచేయకుండా.. కేవలం ఆరునెలల్లోనే దానిని అధిగమించి.. తన లక్ష్యం దిశగా పయనించాడని పేర్కొన్నారు. తమ కొడుకును ఈరోజు ఇలా చూడటం తమకు చాలా గర్వంగా ఉందని చెబుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరిస్తానని డానిష్ గట్టినమ్మకంతో ఉండేవాడని, నేడు తన కలను సాకారం చేసుకున్నాడని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి