iDreamPost

బ్రహ్మపుత్రుడితో మాస్ ఇమేజ్ – Nostalgia

బ్రహ్మపుత్రుడితో మాస్ ఇమేజ్ – Nostalgia

సరిగ్గా వాడుకోవాలే కానీ చైల్డ్ సెంటిమెంట్ తో ఒకేసారి క్లాసుని మాసుని ఈజీగా పడగొట్టొచ్చు. దానికి కమర్షియల్ హీరో తోడైతే స్టామినా ఇంకా పెరుగుతుంది. పసివాడి ప్రాణం లాంటివి ఉదాహరణగా చెప్పొచ్చు. వెంకటేష్ కు సైతం అలాంటి మూవీ ఒకటుంది. ఆ విశేషాలు చూద్దాం. 1987లో తమిళంలో డాక్టర్ డి రామానాయుడు గారు విసి గుహనాథన్ రచన దర్శకత్వంలో ‘మైకేల్ రాజ్’ అనే సినిమా నిర్మించారు. రఘువరన్ ప్రధాన పాత్రలో బేబీ షాలిని ఓ ముఖ్యమైన క్యారెక్టర్ లో రూపొందిన ఈ చిత్రం వంద రోజులు ఆడి సూపర్ హిట్ కొట్టింది. దీన్నే తర్వాతి సంవత్సరం వెంకటేష్ తో తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు నాయుడు గారు.

ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. అక్కడ రఘువరన్ కు హీరో ఇమేజ్ లేదు కాబట్టి కథాపరంగా ఉన్న కొన్ని పరిమితులు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇక్కడ అలా కాదు. వెంకటేష్ కు అప్పటికే ఒక ఇమేజ్, ఫాలోయింగ్ వచ్చేసింది. అందులోనూ మాస్ కు దగ్గర చేసేలా నాయుడు గారు స్టోరీ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒరిజినల్ వెర్షన్ లోని మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకుని దాన్ని వెంకటేష్ కు తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేసే బాధ్యతను దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి అప్పగించారు. సురేష్ బ్యానర్ లో ‘ప్రేమమందిరం’ రూపంలో ఫ్లాపు అందుకున్న దాసరి ఈసారి మాత్రం అలా జరగకూడదని ముందే డిసైడ్ అయ్యారు.

ఆ సమయంలోనే స్టూడియో నిర్మాణం ప్రారంభించారు నాయుడు గారు. బ్రహ్మపుత్రుడులోని కీలక షెడ్యూల్ మొత్తం స్లమ్ ఏరియా సెట్ వేసి ఇక్కడే చిత్రీకరించారు. తమిళంలో నటించిన బేబీ షాలినిని మాత్రమే ఇక్కడ రిపీట్ చేశారు. రజిని హీరోయిన్ కాగా జయసుధ, మోహన్ బాబు, నూతన్ ప్రసాద్, సుత్తివేలు, అల్లు తదితరులు ఇతర తారాగణం. చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. వెంకీతో పోటీ పడిన షాలిని నటన ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. 1988 జూలై 1న బడి, సగటు మనిషి, మిస్టర్ హీరో, అనామికలతో పాటుగా విడుదలైన బ్రహ్మపుత్రుడు ఆశించిన విజయాన్ని సొంతం చేసుకుని నాయుడుగారికి మరింత ఆర్థిక బలాన్ని ఇచ్చింది

Also Read :పల్టీ కొట్టిన మల్టీ స్టారర్ – Nostalgia 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి