iDreamPost

నోరు విప్పని గాంధీ.. ముందుకు సాగని సీబీఐ విచారణ

నోరు విప్పని గాంధీ.. ముందుకు సాగని సీబీఐ విచారణ

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ నోరు విప్పడం లేదు. మే 1 నుంచి 4వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి బొల్లినేనిని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు వేసి విచారిస్తున్నారు. తొలిరోజు విచారణలో సీబీఐ అధికారులకు గాంధీ ఏమాత్రం సహకరించలేదు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2019 జూలైలో బొల్లినేనిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా సహకరించకపోవడంతో ఏప్రిల్‌ 20న ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలోనూ అనారోగ్య కారణాలు చూపి అరెస్టు తప్పించుకుందామనుకున్న గాంధీని సీబీఐ ఎట్టకేలకు అరెస్టు చేసింది. గతంలో ఇలాంటి కేసులు ఎన్నో విచారించిన బొల్లినేని ప్రస్తుతం తానే ముద్దాయి కావడంతో కావాలనే సమాధానం చెప్పడం లేదు.

బొల్లినేని అక్రమాలకు అంతే లేదు..!

సీజీఎస్టీ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాసగాంధీ అక్రమాలు బోలెడు. అవి ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుతోపాటు రూ.5 కోట్ల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసగాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గాంధీ దాదాపు రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన విధులు నిర్వహించిన చోటల్లా వివాదాలతో సావాసం చేసేవారన్న ఆరోపణలకు క్రమంగా బలం చేకూరుతోంది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివిధ కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

సీవీసీ, ఆర్థికశాఖ, సీజీఎస్టీ వద్ద..

పోస్టింగ్‌ల విషయంలో గాంధీకి తెరవెనుక అనేక శక్తులు సాయం చేశాయన్న విమర్శలు బోలేడున్నాయి. ఈ విషయంపై గతంలో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.

2019లో శ్రీనివాసగాంధీ బేగంబజార్‌ జీఎస్టీ సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కూలింగ్‌ పీరియడ్‌లో ఉన్నారు. వాస్తవానికి కూలింగ్‌ పీరియడ్‌లో ఉన్నవారికి ఎలాంటి కేసులు అప్పగించరు. నిబంధనల ప్రకారం… కూలింగ్‌ పీరియడ్‌లో కనీసం రెండు సంవత్సరాలపాటు పనిచేయాలి. కానీ, ఆయన కూలింగ్‌ పీరియడ్‌లో మూడు నెలలు కూడా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు రాజకీయ నేతలు, సొంత శాఖలోని ఇద్దరు వివాదాస్పద ఉన్నతాధికారులు ఆయన్ను తాత్కాలిక డిప్యుటేషన్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా బషీర్‌బాగ్‌లోని యాంటీ ఈవేషన్‌ వింగ్‌–జీఎస్టీకి బదిలీ చేశారు.

సాధారణ ఉద్యోగులకు ఇలాంటి బదిలీలు దాదాపుగా అసాధ్యం. ఈ వివాదాస్పద బదిలీ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌–ఢిల్లీ, జీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ హైదరాబాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రికి కూడా పంపారు. గాంధీ అక్రమాలకు సహకరించిన చిలుక సుధారాణి, ఇద్దరు జీఎస్టీ ఉన్నతాధికారులపై త్వరలోనే అధికారిక విచారణ ప్రారంభం కానుందని సమాచారం.

హైదరాబాద్‌లోని ఓ వ్యాపారి నుంచి 2020లో రూ.5 కోట్ల లంచం డిమాండ్‌ చేసిన కేసు తెరపైకి రానుంది. ఈ కేసులోనూ సీబీఐ అధికారులు చురుగ్గా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రూ.10 లక్షల లంచం తీసుకున్నారని సీబీఐ అధికారులు నిర్ధారించారు. మిగిలిన సాంకేతిక, డాక్యుమెంటెడ్‌ ఆధారాలు కూడా సేకరించేపనిలో సీబీఐ నిమగ్నమైంది.

Also Read : సీబీఐ కస్టడీకి బొల్లినేని గాంధీ.. వెలుగులోకి రానున్న వందల కోట్ల ఆస్తులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి