iDreamPost

రుషికొండ బీచ్ కి బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ ?

రుషికొండ బీచ్ కి బ్లూఫ్లాగ్ సర్టిఫికేట్ ?

ముఖ్యమంత్రి వై.యస్ జగన్ విశాఖ వాసులకు రాజధాని ప్రకటించి తీపి కబురు అందించిన విషయం మరువక ముందే విశాఖ వాసులకు బ్లూఫ్లాగ్ బీచ్ పేరిట మరో తీపి కబురు సిద్దమయింది. దేశంలో బీచ్ లను పర్యావరణ హితంగా ముస్తాబు చేసి టూరిస్టులను ఆకర్షించేందుకు కేంద్రం చేపట్టిన “బ్లూ ఫ్లాగ్” ప్రాజెక్ట్ కు ఎంపికైన 13 బీచ్ లలో విశాఖ రుషికొండ బీచ్ కూడా చోటు దక్కించుకుంది.

బ్లూ ఫ్లాగ్‌ అంటే?

కాలుష్యం కొంచం కూడా లేకుండా పూర్తిగా పర్యావరణ కూలంగా ఉన్న సముద్ర తీరాలను బ్లూఫ్లాగ్‌ బీచ్‌లు అంటారు. 1987 నుంచి డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ అందిస్తోంది. ఇప్పటివరకు ఈ సంస్థ 46 దేశాల్లో 4,500 బీచ్‌లు ఈ సర్టిఫికెట్‌ అందించింది. అయితే తాజాగా తొలిసారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు అనేది ఉంటే బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టిఫికెట్‌ దక్కాలంటే బీచ్‌ లోని నీరు కలుషితం కాకుండా, పరిసరాలు పరిశుభ్రంగా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధి విధానలను పాటించిన బీచ్ లకు (ఎఫ్‌ఈఈ) సంస్థ బ్లూ ఫ్లాగ్ బీచ్ గా సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉన్న బీచ్ లకే అధికశాతం విదేశీ టూరిస్టులు వస్తూ ఉంటారు కనుక పర్యటాక రంగంలో కూడా విశాఖ ఎంతో అభివృద్ది చెందుతుంది.

కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిశీలనలో బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా ఎంపిక కావాలంటే 80 శాతం మార్కులు రావాలి. ఇందులో రుషికొండ బీచ్‌కు 53 మార్కులుతో దేశంలోనే ఎంపికైన 13 బీచ్ లలో ప్రథమ స్థానం దక్కించుకోవడంతో బీచ్‌ 600 చదరపు మీటర్ల మేర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లు కేటాయించింది. అయితే ఇటీవల విశాఖలో బ్లూఫ్లాగ్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా బీచ్ లో జరుగుతున్న పనుల్ని నిపుణుల బృందం పరిశీలించి 80 శాతం పనులు పూర్తైనట్లు ధృవీకరించారు. ఇక జూన్‌లో బ్లూఫ్లాగ్‌ బృందం బీచ్‌ను పరిశీలించే అవకాశం ఉండటంతో బ్లూఫ్లాగ్‌ ని విశాఖ తీరంలో ఎగరవేయడం ఖాయం గా కనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి