iDreamPost

యూపీ ఎన్నికలల్లో హింస

యూపీ ఎన్నికలల్లో హింస

దేశంలో అతి కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు పరిస్థితి దాదాపు ప్రశాంతంగానే ఉంది. తొలి ఐదు దశల పోలింగ్ చిన్నపాటి ఘటనలు మినహా హింసకు తావు లేకుండానే జరిగింది. కానీ ఆరో దశ పోలింగుకు ముందు హింస, ఉద్రిక్తతలు చెలరేగాయి. మాజీమంత్రి, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అయిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పై బీజేపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మాజీమంత్రి వాహనాన్నే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆయన సొంత వాహనంలో కాకుండా మరో వాహనంలో ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ దాడిలో మాజీమంత్రి డ్రైవరుతోపాటు పలువురు ఎస్పీ కార్యకర్తలు గాయపడ్డారు. కాన్వాయ్ లో ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

పూర్వాంచల్లో పట్టున్న ఓబీసీ నేత

యూపీలో మరో రెండు దశల పోలింగ్ మిగిలి ఉంది. పూర్వాంచల్ (తూర్పు యూపీ) పరిధిలోని 111 నియోజకవర్గాల్లో ఈ నెల 3, 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. మూడో తేదీన జరిగే పోలింగులో పూర్వాంచల్లో పట్టున్న స్వామి ప్రసాద్ మౌర్య పోటీ చేస్తున్న కుషినగర్ జిల్లాలోని ఫాజిల్ నగర్ నియోజకవర్గం కూడా ఉంది. మంగళవారం సాయంత్రం ఈ ప్రాంతాల్లో ప్రచార గడువు ముగిసింది. దాంతో రోడ్డు షో ముగించుకుని తిరిగి వెళ్తున్న మౌర్య కాన్వాయ్ కి కాల్విపత్తి గ్రామం వద్ద ఎదురుపడిన బీజేపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. తనపై దాడికి బీజేపీయే కారణమని స్వామి ప్రసాద్ ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులకు తెగించిందని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఆరోపించారు.

తండ్రి కోసం బీజేపీ ఎంపీగా ఉన్న కుమార్తె ప్రచారం

ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న స్వామి ప్రసాద్ కుమార్తె సంఘమిత్ర మౌర్య కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న ప్రముఖుల హస్తం దీని వెనుక ఉందన్నారు. తన తండ్రిపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రమేయంతోనే ఈ దాడి జరిగిందని ఆమె ఆరోపించారు. సంఘమిత్ర బీజేపీ ఎంపీగా ఉన్నప్పటికీ ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తండ్రి స్వామి ప్రసాద్ విజయం కోసం నిర్విరామంగా ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆమె ఫజిల్ నగర్లోనే మకాం వేశారు.

ఎన్నికల ముందే మంత్రి పదవికి, బీజేపీకి గుడ్ బై

స్వామి ప్రసాద్ మౌర్య యోగి ప్రభుత్వంలో మంత్రిగా నిన్న మొన్నటి వరకు పనిచేశారు. ఎన్నికలకు ముందే మంత్రి పదవిని, బీజేపీని వదిలిపెట్టి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో మంత్రి దారాసింగ్ చౌహాన్, మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి అప్పట్లో ఝలక్ ఇచ్చారు. చివరి రెండు దశలు పోలింగ్ జరగాల్సిన పూర్వాంచల్లో ఓబీసీలు ప్రాబల్యం అధికం. మౌర్య, చౌహాన్ ఇద్దరూ ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న ఓబీసీ నేతలే. వీరి మద్దతుతోనే 2017 ఎన్నికల్లో బీజేపీ తూర్పు యూపీలో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు వారిద్దరూ ఎస్పీలో చేరి పోటీ చేస్తున్న నేపథ్యంలో మౌర్యపై దాడి జరగడం కలకలం రేపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి