iDreamPost

బీజేపీకి సింగిల్‌ డిజిట్‌.. ఆప్‌కు 90 శాతం..

బీజేపీకి సింగిల్‌ డిజిట్‌.. ఆప్‌కు 90 శాతం..

ఢిల్లీ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం ఏడు సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి తన స్థానాలను స్వల్పంగా పెంచుకుంది.

ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచీ బీజేపీ దాదాపు 15 నుంచి 20 స్థానాల మధ్య ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. ఒకానొక దశలో ఆప్, బీజేపీ మధ్య 27 స్థానాల్లో హోరా హోరీ నడిచింది. బీజేపీకి ఖచ్చితంగా 20 స్థానాల వరకు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. బీజేపీ నేతలు కూడా అదే ఆశతో ఉన్నారు. అయితే కౌంటింగ్‌ కొనసాగే కొద్దీ ఆప్‌.. బీజేపీని వెనక్కి నెట్టింది. చివరకు ఏడు స్థానాలకు బీజేపీని పరిమితం చేసింది.

ఇక కాంగ్రెస్‌ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రారంభంలో రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్న ఆ పార్టీ మరికొద్ది రౌండ్లకే ఆ ఆధిక్యం కోల్పోయింది. చివరకు గత ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్‌కు దక్కాయి. గత ఎన్నికల్లో బోణి చేయని హస్తం పార్టీ ఈ ఎన్నికల్లోనూ అదే సీను రిపీట్‌ చేసింది.

ప్రస్తుతం బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఐదు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కౌంటింగ్‌ చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ స్థానాలు కూడా ఆప్‌ గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద 70 స్థానాలు గల ఢిల్లీ శాసన సభలో ఆప్‌ 63 స్థానాలు, బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకోవడం దాదాపు ఖాయమైంది. దీంతో శాసన సభ స్థానాల్లో ఆప్‌ 90 శాతం సీట్లు గెలుచుకున్నట్లవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి