iDreamPost

ఎవరీ వెంకట రమణ రెడ్డి? KCR, రేవంత్ ఇద్దరినీ ఎలా ఓడించాడు?

BJP Candidate Katipally VenkataRamana Reddy Won on KCR & Revanth Reddy in Kamareddy: కామారెడ్డిలో సంచలన విజయం నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా వార్తల్లో నిలిచిన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయం సాధించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి చరిత్ర సృష్టించారు.

BJP Candidate Katipally VenkataRamana Reddy Won on KCR & Revanth Reddy in Kamareddy: కామారెడ్డిలో సంచలన విజయం నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా వార్తల్లో నిలిచిన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయం సాధించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి చరిత్ర సృష్టించారు.

ఎవరీ వెంకట రమణ రెడ్డి? KCR, రేవంత్ ఇద్దరినీ ఎలా ఓడించాడు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం సంచలనంగా మారింది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఊహించని విజయాలను అందుకున్నారు. ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన కామెరెడ్డి నియోజకవర్గం ఎన్నికల్ల ఫలితాల్లో కూడా సంచలనం సృష్టించింది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయ దుందుభి మోగించారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిపి ఓడించి కొత్త చరిత్ర సృష్టించారు. వెంకటరమణా రెడ్డి గెలుపుతో బీజీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు కొందరికి ఊహించని విజయాన్ని అందించగా.. మరికొందరికి పరాజయాన్ని చవిచూపించాయి. తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరిచూపు కామారెడ్డిపై పడింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు పట్టువిడవనని ప్రకటించాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పోటీచేస్తున్న నియోజకవర్గం నుంచి తాను కూడా నామినేషన్ దాఖలు చేసి కేసీఆర్ కు సవాల్ విసిరాడు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి బరిలోకి దిగారు. ఈ క్రమంలో కేసీఆర్, రేవంత్ ల మధ్యనే పోటీ ఉంటుందని భావించారు.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణా రెడ్డి అనూహ్య విజయాన్ని అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ ను ఓడించి కామారెడ్డిలో కొత్త చరిత్ర లిఖించాడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠతకు తెరలేపిన కామారెడ్డి ఫలితం అనూహ్య మలుపు తిరిగి 6,741 ఓట్ల మెజారిటీతో వెంకటరమణా రెడ్డి గెలుపొందారు. స్థానిక నేత అయిన కాటిపల్లికే ప్రజలు పట్టం కట్టారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా 2018 లో బీఆర్ఎస్ చేతిలో ఓటమిని చవిచూసిన వెంకటరమణా రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఏకంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను ఓడించి దెబ్బకు దెబ్బకొట్టాడు.

ప్రజల్లో విశ్వాసం:

కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారాలు చేశాయి. కానీ బీఆర్ఎస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడంతో కాంగ్రెస్ కు కలిసొస్తుందని భావించారు. దీనికి గల మరో కారణం ప్రజల్లో రేవంత్ కు ఉన్న క్రేజ్. ఇదే సమయంలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకెళ్లారు. కాగా అంతిమంగా మాత్రం ప్రజలు బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డికి విజయం కట్టబెట్టారు. కామారెడ్డిలో లోకల్ లీడర్ కావడం కాటిపల్లికి ప్లస్ అయ్యింది.

దీనికి తోడు నియోజకవర్గంపై మంచి పట్టు కలిగి ఉన్నారు. పార్టీతో సంబంధం లేకుండా బలమైన కేడర్ ను డెవలప్ చేసుకున్నారు. ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో రమణారెడ్డికి బాగా కలిసొచ్చింది. మొదటి నుంచి గెలుపుపై ధీమాగా ఉన్న వెంకటరమణా రెడ్డి రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైన కేసీఆర్, రేవంత్ లను ఓడించి విజయం సాధించారు. కాగా కామారెడ్డిలో వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్‌ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్‌ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

వెంకటరమణా రెడ్డి రాజకీయ ప్రస్థానం:

కాటిపల్లి వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన వెంకటరమణా రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఓటమిని సవాల్ గా తీసుకున్న అయనా మరింత కసిగా పనిచేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సాధకబాధకాల్లో పాలుపంచుకున్నారు. ప్రతిపక్షాలు ప్రలోభాలతో ఓట్లు దండుకోవాలని చూసినా వెంకటరమణా రెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు.

అక్రమాలపై ఉక్కుపాదం

వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్‌మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. మరి కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలుపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి