iDreamPost

“మహా”లో మళ్లీ ఆపరేషన్ కమలం…కరోనా సంక్షోభంతో పావులు కదుపుతున్న బిజెపి…. అధికార,ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు

“మహా”లో మళ్లీ ఆపరేషన్ కమలం…కరోనా సంక్షోభంతో పావులు కదుపుతున్న బిజెపి….  అధికార,ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు

దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా ఇవేవీ పట్టని నేతలు రాజకీయ విమర్శలకు దిగుతూ అధికార పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌స్పాట్‌ కేంద్రంగా మారుతున్న ముంబై మహానగరం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరు పెట్టేలా ఉంది.

సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీలు జట్టు కట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బిజెపి..సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇ‍ప్పటికే ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్రలో రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని బిజెపి సీనియ‌ర్ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కూడా మంత్రుల‌తో విమ‌ర్శ‌లు చేయిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రి పియుష్ గోయ‌ల్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేపై విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌రోనాను సాకుగా చూపి బిజెపి ‘‘ఆప‌రేష‌న్ క‌మలం’’ను తిరిగి ప్రారంభించింది. శివ‌సేన‌, కాంగ్రెస్, ఎన్సీపి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మ‌చారం.

ప్ర‌భుత్వంలో భేదాభిప్రాయాల‌ను సాకుగా చూపి
కరోనా వైరస్‌ సంక్షోభం, లాక్‌డౌన్ నిబంధనల సడలింపు విషయంలో భేదాభిప్రాయాలు మహారాష్ట్రలోని అధికార సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలకు కారణమైందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో వీరు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. గంటన్నర పాటు చర్చలు జరిపినట్లు స‌మాచారం. పవార్, థాకరే మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే ఆర్ధికంగా కోలుకోవడం కష్టమని పవార్ చెప్పడం థాకరేకు నచ్చలేదని తెలుస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో లాక్‌డౌన్ ఎత్తివేసేందుకు థాకరే సుముఖత వ్యక్తం చేయకపోవడమే వారి బంధాన్ని బలహీనంగా మార్చిందని సమాచారం.

అయితే రెండు పార్టీలకు చెందిన నాయకులు మాత్రం ఈ వార్తలను తోసిపుచ్చుతూ, బిజెపి కుట్ర‌ల ప‌న్న‌గంపై మండిపడ్డారు. ఆ పార్టీ అధికార దాహమే ఈ ప్రచారానికి కారణమని విమర్శించారు. ప్రస్తుత కరోనా సంక్షోభం గురించే ఇద్దరు నాయకులు చర్చించుకున్నారని తెలిపారు. దీనికి తోడు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని శ‌ర‌ద్‌ పవార్ కలుసుకున్నారు. ఈ తరుణంలో పవార్-ఉద్ధవ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప‌వ‌ర్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డంలో ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని, గవర్నర్‌ ఆహ్వానం మేరకే పవార్ రాజ్‌భవన్‌కు వెళ్లారని ఎన్సీపి సీనియ‌ర్ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. ఈ అధికార కూటమి ఏర్పడిన అనంతరం పవార్ మొదటి సారి గవర్నర్‌ను కలిశారు.

రాష్ట్రపతి పాలనకు బిజెపి డిమాండ్ః రాజ‌కీయ కుట్ర‌లు
క‌రోనా వైరస్‌ కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మరోవైపు పౌరులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష బిజెపి విమర్శలకు మరింతగా విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది. వైరస్‌ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియ‌ర్ నేత‌ నారాయణ్‌ రాణే గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో భేటీ కావడం, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోదని రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఉద్ధేశ పూర్వకంగానే గవర్నర్‌తో మంతనాలు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఉద్ధవ్‌ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌లో మంత్రులు, నేతల మధ్య విభేదాలు ఉన్నాయని బిజెపి ప్రచారం చేస్తోంది. వైరస్‌ వ్యాప్తి ఒకవైపు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరోవైపు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి కరోనా కష్ట కాలంలోనూ మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర..అలా చేస్తే ప్రజలు తరిమికొడతారు
మరోవైపు ప్రభుత్వంలో అసంతృప్తి పేరుతో ప్ర‌చారం చేసిన‌ బిజెపి నేతలు సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు కుట్ర ప‌న్నుతున్నారు. భేటీ అనంతరం పవర్‌ మీడియా మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలో త‌మ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడిపోరుతో కరోనాను కట్టడి చేసి తీరతామన్నారు.
‘‘ప్రభుత్వానికి ఏ ముప్పు లేదు. ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తే, ప్రజలు తరిమికొడతారు’’ అని వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌భుత్వానికి ఢోకా లేదు
ప్రభుత్వ స్థిరత్వం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్విటర్ వేదికగా శివసేన పార్టీ ఎంపి సంజయ్ రౌత్ ఆ ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. ‘‘శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. కడుపు ఉబ్బు తట్టుకోలేక కొందరు ఇలాంటివి ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు. జై మహారాష్ట్ర!’’ అని ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ, నితీన్ గడ్కరీ కానీ ఇంతవరకూ ప్రస్తావించలేదని రౌత్ గుర్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించనున్నారనే కథనాలను ఆయన కొట్టిపారేశారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ వ్యవస్థ విఫలంః కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ ఆరోప‌ణ‌
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. రాష్ట్రానికి రైల్వేశాఖ తక్కువ సంఖ్యలో రైళ్లను కేటాయిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్ధవ్‌ ఠాక్రే నిందించడం దురదృష్టకరమని గోయల్‌ అన్నారు. వలస కార్మికులను తరలించేందుకు 80 ప్రత్యేక రైళ్లు కావాలని కోరగా రైల్వేశాఖ కేవలం 30నుంచి 40 రైళ్లనే సమకూర్చిందని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. రైల్వేశాఖ దాదాపు 65 రైళ్లు ఏర్పాటు చేయగా వాటిలో తరలించడానికి కార్మికులను తీసుకురావడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పియుష్ గోయ‌ల్ అన్నారు. రాష్ట్రానికి సరిపడే రైళ్లను రైల్వేశాఖ అందుబాటులో ఉంచడం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా ట్విటర్‌లో పేర్కొన్నారు. మ‌రోవైపు బిజెపి నేత‌లు, కేంద్ర మంత్రుల విమ‌ర్శ‌ల‌పై అధికార శివ‌సేన‌, ఎన్సీపి, కాంగ్రెస్ పార్టీలు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో ప‌రిస్థితులు ఏటువైపు దారి తీస్తాయో చూడాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి