iDreamPost

టీడీపీలో ఆందోళన పెంచుతున్న సోము వీర్రాజు

టీడీపీలో ఆందోళన పెంచుతున్న సోము వీర్రాజు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీ ఫలితాలు సాధించడం తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ నేతల్లో జోష్‌ కనిపిస్తోంది. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాలు గెలుచుకునేలా ఐదేళ్లలో బీజేపీ బలపడడం అందరినీ ఆలోచింపజేస్తోంది. బీజేపీ సాధించిన దాదాపు అన్ని సీట్లు గతంలో టీఆర్‌ఎస్‌ సాధించినవే అయినా.. కాంగ్రెస్‌ స్థానం ప్రజలు బీజేపీకి ఇచ్చినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్ష స్థానం, ఆ తర్వాత అధికారం.. ఇలా తమ పయనం సాగుతుందని బీజేపీ నేతలు ఇప్పటికే చెప్పారు. దానికి అనుగుణంగానే రాజకీయాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలో పాగా వేసేందుకు 2019 ఎన్నికల తర్వాత బీజేపీ విస్తృతం చేసింది. అప్పటి వరకు ఏదో ఒక పార్టీతో వెళ్లడం, ఉనికి కోసం రాజకీయాలు చేసే బీజేపీ.. ఇప్పుడు మాత్రం అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ దిశగా తెలంగాణలో తొలి విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఫలితాల ద్వారా తేటతెల్లం అయింది.

ఏపీలోనూ ఆ పార్టీ బలపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని గతంలో వ్యాఖ్యలు చేసిన బీజేపీ పెద్దలు.. ఆ స్థానం తాము భర్తీ చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే రాజకీయాలు చేస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుగా వెళుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్, టీడీపీలు ఉండని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ–జనసేనల మధ్యనే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.

జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారంటూ చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. బీజేపీలో వలసలుంటాయని ఈ మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు నిర్థారిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఫలితాలను ఏపీలోనూ ఉపయోగించుకునేందుకు సోము వీర్రాజు ప్రత్నిస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్, టీడీపీలు ఏపీలో ఉండవనే వ్యాఖ్యలు చేశారనేది ఓ విశ్లేషణ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి