iDreamPost

తీగ లాగితే డొంక కదులుతోంది.. చంద్రబాబు హయాంలో మరో స్కామ్

తీగ లాగితే డొంక కదులుతోంది..  చంద్రబాబు హయాంలో మరో స్కామ్

విభజన గాయంతో బాధపడుతున్న నవ్యాంధ్ర తొలి పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు మెడకు మరో అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. గత టీడీపీ హయాంలో వైద్య పరికరాల నిర్వహణ పేరుతో భారీ కుంభకోణం జరిగినట్లు ఇప్పుడిప్పుడే నిర్ధారణ అవుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో సీఐడీ నిర్వహిస్తున్న తనిఖీల్లో ఆనాటి ప్రభుత్వ దోపిడీ ఆధారాలతో సహా వెలుగు చూస్తోంది. ఈ వ్యవహారంలో రూ. 200 కోట్లకుపైనే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాసరావు సన్నిహితులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పాత్ర ఇందులో ఉన్నట్లు సమాచారం.

ఏమిటీ కుంభకోణం

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య పరికరాల నిర్వహణ పనులు చేపట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏపీఎస్ ఎంఐడీసీ ద్వారా 2015లో టెండర్లు పిలిచింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలిమాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ సంస్థకు టెండర్ ఖరారు చేశారు. ఆస్పత్రుల్లో ఉన్న సీటీ స్కాన్, ఎక్స్ రే, ఎమ్మారై వంటి వైద్య పరికరాల వాస్తవ విలువలో 7.45 శాతం నిర్వహణ ఖర్చుగా ఇవ్వాలన్నది టెండరు ఒప్పందం. సరిగ్గా ఇక్కడే అక్రమాలు చోటు చేసుకున్నాయి. వైద్య పరికరాల విలువను బాగా ఎక్కువ చేసి చూపించడం ద్వారా అధిక నిర్వహణ ఖర్చులు గుంజుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాల మొత్తం విలువ రూ.300 కోట్లలోపే ఉండగా.. దాన్ని రూ.508 కోట్లుగా చూపించి ఆ మొత్తం మీద 7.45 శాతం లెక్కగట్టి నిర్వహణ పేరుతో బిల్లులు చేయించేసుకున్నారు. దీనికి తోడు మొదట ఒక ఏడాదికే కాంట్రాక్ట్ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం.. తాను అధికారంలో ఉన్నంత కాలం.. అదే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం పొడిగించుకుంటూ పోయింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లింది.

Also Read : వైసీపీ గెలుపుకు మరో కొత్త కారణం చెబుతున్న చంద్రబాబు

హైకోర్టు జోక్యంతో..

వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన ఈ భారీ గోల్ మాల్ పై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు అనే వ్యక్తి అప్పట్లోనే ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించింది. ఆ మేరకు దర్యాప్తు జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో ప్రాథమికంగా అక్రమాలు నిర్ధారణ కావడంతో.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మరింత లోతైన దర్యాప్తు అవసరమని గుర్తించి ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాల మేరకు సీఐడీ దర్యాప్తు వేగం పెరిగింది.

తనిఖీల్లో బయట పడుతున్న అక్రమాలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. శని, ఆదివారాల్లో విశాఖ కేజీహెచ్ లో నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు గుర్తించారు. కేజీహెచ్ లో పనిచేయని సీటీ స్కాన్ ను పని చేస్తున్నట్లు చూపించి నిర్వహణ ఖర్చులు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇక్కడ సీటీ స్కాన్ విలువ రూ. 2 కోట్లుగా చూపారు. కర్నూలులో ఎమ్మారై స్కాన్ విలువ రూ.3.60 కోట్లుగా చూపి దానిపై 7.45 శాతం నిర్వహణ ఖర్చులు రాసేసుకుంటున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. వాస్తవానికి దాని అసలు ధర రూ.1.69 కోట్లేనని తనిఖీ అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్(రిమ్స్)లో, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆస్పత్రుల్లోనూ సీఐడీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. శ్రీకాకుళంలో సీఐడీ డీఎస్పీ కాళిదాసు, విజయనగరంలో డీఎస్పీ చక్రవర్తి తనిఖీలు నేతృత్వం వహించారు. రాష్ట్రంలోని 1315 ఆస్పత్రుల్లోనూ తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఐడి వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని.. ఈ బృందాలు ఆయా ఆస్పత్రుల్లో ఉన్న బయో వైద్య పరికరాల విలువ, వాటి కాలపరిమితి, వాటి కండిషన్ వంటి వివరాలు సేకరిస్తున్నాయని చెప్పారు.

Also Read : రాళ్ల దాడా.. టీడీపీ అద్భుత సృష్టా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి