iDreamPost

బీహార్ ముఖ్య‌మంత్రిపై బాంబు దాడి

బీహార్ ముఖ్య‌మంత్రిపై బాంబు దాడి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై మంగళవారం బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభపై ఓ దుండగుడు బాంబు విసిరాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే.. వేదికకు పదిహేను నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్‌ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. గ‌త నెల‌లోనూ నితీశ్ కుమార్ పై దాడి జ‌రిగింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ వ్యక్తి పాట్నా శివార్లలో బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై భౌతికంగా దాడి చేశాడు. శంకర్ కుమార్ వర్మ అనే వ్యక్తి.. భద్రతా వలయాన్ని తప్పించుకుంటూ చాలా దూరం వచ్చాడు. భద్రతా సిబ్బంది అతడిని పట్టుకునే లోపే ముఖ్యమంత్రిని వెనుక నుండి దెబ్బ కొట్టాడు. అయితే ఆ యువకుడిపై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని భద్రతా సిబ్బందిని ముఖ్యమంత్రి నితీశ్ ఆదేశించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉన్నారని ప్రాథమికంగా నిర్ధారించారు.

2020లోనూ దాడి

బీహార్ సీఎం నితీశ్ పై దాడి ఇదే మొద‌టిసారి కాదు. గ‌త నెల‌లో భౌతికంగా దాడి జ‌రిగితే.. 2020 నవంబర్‌లో మధుబని జిల్లాలోని హర్లాఖిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు నితీష్ కుమార్‌పై ఉల్లిపాయలు విసిరారు. ఉల్లిపాయలు విసరడంతో మొదట అవాక్కైన నితీశ్ తర్వాత లైట్ తీసుకుని “ఖూబ్ ఫెంకో-ఖూబ్ ఫెంకో” (మరికొన్ని విసరండి) అని హాస్యాస్పదంగా అన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది నితీశ్ చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. అప్పుడు కూడా నిందితుడి గురించి పట్టించుకోవద్దని భద్రతా సిబ్బందికి సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి