iDreamPost

సెంటిమెంట్ సినిమాలా మారిన బిగ్ బాస్

సెంటిమెంట్ సినిమాలా మారిన బిగ్ బాస్

దూకుడు సినిమాలో బ్రహ్మానందం లేని రియాలిటీ షోని ఊహించుకుంటూ నాగార్జున గారు వాణ్ణి ఎలిమినేట్ చేసేయండి అంటూ ఉత్తుత్తి కెమెరా ముందు అద్భుతమైన నటన ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలడమే కాదు ఆ మూవీ సక్సెస్ లో కీలక భాగం దక్కించుకుంది. దాన్నుంచి ఇన్స్ ఫైర్ అయ్యారో ఏమో కానీ రాను రాను బిగ్ బాస్ 4 పార్టిసిపెంట్స్ కూడా అంతకు మించి అనే స్థాయిలో మాతృదేవోభవ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. ఎంత అతిగా ఎమోషనల్ అయిపోయి ఏడిస్తే అంత ప్రేక్షకుల సానుభూతి దక్కుతుందని స్క్రిప్ట్ రైటర్స్ ముందే చెప్పారో ఏమో కానీ పోటీపడి మరీ జీవించేస్తున్నారు. వామ్మో మరీ ఇంతనా అనిపిస్తున్నారు.

అమ్మ రాజశేఖర్ వెళ్ళిపోయాక అవినాష్ నడిపించిన భావోద్వేగాల డ్రామా ఇంకా ఫ్రెష్ గా ఉండగానే తాను కూడా జాయినవ్వకపోతే వెనుకబడతానని డౌట్ వచ్చిందో ఏమో సోహైల్ కూడా కన్నీటి సాగరంలో మునిగి తేలాడు. ఇతని ఓదార్పు యాత్ర బాధ్యత మెహబూబ్ తీసుకున్నాడు. ఇక అరియనా సైతం కెమెరా ముందుకు వచ్చి సోలో పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తనను పంపించేయండని మోనాల్ సైతం షాకయ్యేలా సముద్రాన్ని పొంగించింది. ఇక వద్దన్నా వినకుండా హిందీలో పాట పాడినందుకు మోనాల్ కు జైలు శిక్ష పడింది. అక్కడా అఖిల్ వచ్చి సోది బాతాఖాని పెట్టుకున్నాడు. సోహైల్ చేసిన బిర్యానీని ఎంజాయ్ చేశారు సభ్యులు

ఇమ్యూనిటీ లభించిన అవినాష్ ని మినహాయించి పదో వారం నామినేషన్లకు రంగం సిద్ధం చేశారు. ఒక్కొక్కరు ఇద్దరి తల మీద బాటిల్ పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో ఆ పని జరిగిపోయింది. ఉన్న తొమ్మిది మందిలో అత్యధికంగా అరియనాను ఏడుగురు నామినేట్ చేయడం గమనార్హం. ఫైనల్ గా తనతో కూడి మెహబూబ్, అభిజిత్, హారిక, మోనాల్, సోహైల్ లు ఫైనల్ నామినేషన్లలో మిగిలారు. లాస్య తన తలపై బాటిల్ తో గట్టిగ కొట్టిందని కాసేపు ఏడ్చింది అరియనా. ఆఖరి బంతి అనే కాన్సెప్ట్ తో ఇవాళ కొత్త తతంగం మొదలుకాబోతోంది. శనివారం వచ్చే దాకా వీళ్లంతా ఇంకేమేం చేయబోతున్నారో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి