iDreamPost

రూ.100కే గ్రాము బంగారం.. రూ.10కే కిలో నూనె.. కట్‌ చేస్తే

  • Published Feb 27, 2024 | 4:15 PMUpdated Feb 27, 2024 | 4:15 PM

అతి తక్కువ ధరకే బంగారం, నిత్యవసర వస్తువులు ఇస్తామంటూ అమాయక ప్రజలను నిలువున ముంచేసిన ఓ ఛారిటబుల్ ట్రస్ట్. ఇంతకి ఎక్కడంటే..

అతి తక్కువ ధరకే బంగారం, నిత్యవసర వస్తువులు ఇస్తామంటూ అమాయక ప్రజలను నిలువున ముంచేసిన ఓ ఛారిటబుల్ ట్రస్ట్. ఇంతకి ఎక్కడంటే..

  • Published Feb 27, 2024 | 4:15 PMUpdated Feb 27, 2024 | 4:15 PM
రూ.100కే గ్రాము బంగారం.. రూ.10కే కిలో నూనె.. కట్‌ చేస్తే

ఈ రోజుల్లో బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అందులో మహిళలకు ఈ బంగారమంటే ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. అసలు బంగారు అతి తక్కువ ధరకు దొరికితే చాలా బాగుంటుందని అందరూ కలలు కంటారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ, ఈ క్రమంలోనే చాలామంది అమాయకులు బంగారంపై ఆశతో మోసపోతుంటారు. తాజాగా గుంటూరులో ఒక గ్రాము బంగారాన్ని అంత తక్కువ ధరకు ఇస్తానని చెప్పి అమాయకులను నిలువుగా ముంచేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా బంగారం తక్కువ ధరకు ఇవ్వడమంటూ ఎక్కడా జరగదు. అలాంటిది తాజాగా గుంటూరులో ఒక గ్రాము బంగారాన్ని కేవలం రూ. 100కే ఇస్తామంటూ అమాయకుల్ని కొందరు మోసం చేశారు. గుంటూరులో ప్రజా సేవా ఛారిటబుల్‌ ట్రస్టు పేరుతో శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్‌ అనే ముగ్గురు వ్యక్తులు హోమ్‌ నీడ్స్‌, బంగారం, ఎలక్ట్రానిక్‌ తదితర వస్తువులు నామమాత్రపు రుసుముకే అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే.. గుంటూరు మంగళదాస్‌ నగర్‌ లో ఓ షాపు ఏర్పాటు చేసి అక్కడ 10 రూపాయలకే కిలో కందిపప్పు, వంట నూనె ఇస్తామంటూ ముగ్గురు, నలుగురికి ఇచ్చారు. రూ.300 కట్టి సభ్యత్వం తీసుకుంటే.. నిత్యావసర వస్తువులు మూడుసార్లు తీసుకోవచ్చునని చెప్పారు. రూ.1000 కడితే ఎన్నైనా తీసుకోవచ్చని చెప్పి, డబ్బులు కట్టించుకొని ఒకరిద్దరికి ఇచ్చారు. ఆ తర్వాత.. రూ.100కు గ్రాము బంగారం అని చెప్పి ఒకరిద్దరికి ఇచ్చారు. ఇక ఇక్కడ నుంచి అసలు కథని నడిపించారు.

రూ.1500 కడితే.. 10 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పారు. ఒక్కసారిగా వందలాది మంది షాపు చుట్టూ ఈగల్లా మూగారు. రూ.15 వేలకు నాలుగు గ్రాములు, రూ.24 వేలకు 10 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. అంతేకాదు.. 5 వేలకు టీవీ, 3,500కి ఫ్రిడ్జ్, 5 వేలకు వాషింగ్‌ మిషన్‌, 7 వేలకు డబుల్‌ కాట్‌ మంచం, 20 వేలకు ఏసీ ఇస్తామంటూ నమ్మించి అందరి దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అలాగే తమ ట్రస్ట్ వెనక ప్రజా ప్రతినిధులు, వారి భార్యలు ఉన్నారని, ట్రస్టుకు వచ్చే వస్తువులు పేదలకు నామమాత్రపు రుసుంకే ఇస్తున్నామని కూడా నమ్మబలికారు. అయితే కందిపప్పు, బంగారం, ఫ్రిడ్జ్‌, టీవీ తదితర వస్తువులకు ధర ఒక రోజు చెప్పినట్టు, రెండో రోజు ఉండదని.. ఆ రోజు ధర అలాగే ఉంటుందని.. ఇష్టముంటే డబ్బులు కట్టండి అని నమ్మించారు.

అలా వందలాది మంది జనాలు ఫోన్‌పే రూపంలోనూ, అలానే నేరుగా డబ్బులు కట్టారు. వస్తువులు ఎప్పుడొస్తాయా అని నెలలు తరబడి ఎదురు చూశారు. మరి కొంతమంది బంగారానికి రూ.వేలు, రూ.లక్షలు చొప్పున కట్టారు. కాగా, శ్రీనివాసరావు గత నాలుగు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇక ఇదే విషయంపై జనాలను ప్రశ్నిస్తే.. విదేశాల నుంచి బంగారం తెస్తుంటే.. విమానాశ్రయంలో పట్టుకున్నారని, కేంద్ర మంత్రులతో మాట్లాడి విడిపించుకుని వస్తానని.. అందుకే ఫోన్‌ తీయడం లేదని చెబుతున్నారు. ఇలా సుమారు 300 మంది వద్ద దాదాపుగా 3 కోట్ల రూపాయల మేర వసూలు చేసి మోసగించారు. దీంతో గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా, స్పందించిన ఎస్పీ తుషార్‌ దూడి ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఇలాంటి స్కీముల పేరుతో గతంలో కూడా చాలా మోసాలు జరిగాయి. ప్రజలు ఇలాంటి స్కీముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరి, అతి తక్కువ ధరకే నిత్యావసర వస్తువులతో పాటు, బంగారన్ని కూడా ఇస్తామని నమ్మించి ప్రజల్ని మోసం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి