iDreamPost

వెనక్కు తగ్గిన భారీ సినిమాలు : కరోనా దెబ్బ

వెనక్కు తగ్గిన భారీ సినిమాలు : కరోనా దెబ్బ

చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నేరుగా థియేట్రికల్ రిలీజుల మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్లాన్ చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటి వాయిదా వేసుకుంటున్నాయి. అక్షయ్ కుమార్ – అజయ్ దేవగన్ – రన్వీర్ సింగ్ కాంబినేషన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన భారీ పోలీస్ మల్టీ స్టారర్ సూర్యవంశీ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రకటించని తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ నెల 25 అని చెప్పిన డేట్ కి కట్టుబడి ఉండలేకపోతున్నామని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కేరళలో ఇప్పటికే సినిమా హాళ్లు మూసేశారు. ఢిల్లీలోనూ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

ఇప్పుడు ఇలా ఒక్కో రాష్ట్రం స్క్రీన్ల మూసివేత రూట్ లో వెళ్తే వసూళ్ల మీద చాలా విపరీతమైన ప్రభావం ఉంటుంది. అందుకే సూర్యవంశీ యూనిట్ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. మరో వైపు హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేటెస్ట్ వెర్షన్ ని ఏకంగా 2021 ఏప్రిల్ 2 కి ఫిక్స్ చేశారు. అంటే ఏడాది పైగా గ్యాప్. ఫైనల్ కాపీ రెడీగా ఉంచుకుని ఇంత డిలే చేయడం నిజంగా విశేషమే. జేమ్స్ బాండ్ కొత్త సినిమా నో టైం టు డై రిలీజ్ ని కూడా క్యాన్సిల్ చేశారు. నవంబర్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఏవి వాయిదా పడతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ సిరీస్ లో ముందు వచ్చేది నాని వి. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఈ విషయంగా తీవ్ర తర్జనభర్జనలు పడుతున్నట్టు సమాచారం. అదే రోజు ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కూడా షెడ్యూల్ చేశారు. బిజినెస్ జరుపుకుని థియేటర్లను లాక్ చేసిన పరిస్థితిలో ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం అందరికీ రిస్కే. కానీ చేయక తప్పని పరిస్థితి. అంతర్జాతీయంగానూ కరోనా ఎఫెక్ట్ వల్ల జనం సినిమాలు చూసే మూడ్ లో లేరు. ఓవర్సీస్ కలెక్షన్లు చాలా కీలకంగా మారిన తరుణంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మరికొద్ది రోజుల్లో సౌత్ సినిమాల రిలీజులకు సంబంధించి కొత్త ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాతల సమాఖ్య దీని మీద సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి