iDreamPost

భూతం దెబ్బకు ప్రేక్షకులు బెంబేలు

భూతం దెబ్బకు ప్రేక్షకులు బెంబేలు

ఇవాళ విడుదలైన మన తెలుగు సినిమాల సంగతి కాసేపు పక్కనబెడితే హిందీలో రెండు మూవీస్ వచ్చాయి. అందులో హారర్ థ్రిల్లర్ గా కాస్త ఎక్కువ అంచనాలు రేపిన చిత్రం భూత్ ది హాంటెడ్ షిప్. దీనికి నిర్మాత కరణ్ జోహార్ కావడంతో ట్రేడ్ లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. యుఆర్ఐ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని డబుల్ సెంచరీ క్రోర్ కలెక్షన్ ని తన ఖాతాలో వేసుకున్న విక్కీ కౌశల్ హీరో కావడం దీని మీద ఇంకా అంచనాలు పెంచింది. అయితే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.

భూత్ కి దారుణమైన రివ్యూలు రిపోర్ట్స్ వచ్చాయి. క్రిటిక్స్ ఏకంగా 1 కంటే తక్కువ రేటింగ్ ఇచ్చి ఘోరంగా అవమానించారు. హిందీ సినిమాల గురించి సాఫ్ట్ కార్నర్ చూపించే ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ సైతం వన్ బై రేటింగ్ ఇవ్వడం చూసి అందరూ షాక్ తిన్నారు. ఇది చాలదన్నట్టు భూత్ ని సంపూర్ణంగా ఒక సినిమాగా చూపించకుండా సగంలో వదిలేసి పార్ట్ 2 అంటూ ఊరించడం దీన్ని ఇంకా ఎక్కువ దెబ్బ తీస్తోంది.

ముంబై తీరప్రాంతంలో ఆగిపోయి పాడుబడిన ఓ పెద్ద షిప్పులోకి హీరో ప్రవేశించి అందులో రహస్యాలను చేధించే క్రమంలో తానే ప్రమాదంలో ఇరుక్కోవడం ఇందులో ప్రధానమైన కథ. చనిపోయిన భార్య కూతురు పాత్రలు కూడా ఆ షిప్పులో ఉండటం మరో ట్విస్ట్ . పాయింట్ బాగానే ఉన్నా దర్శకుడు భాను ప్రతాప్ సింగ్ పేలవమైన టేకింగ్ సహనానికి పరీక్ష పెట్టింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ భరించలేని విధంగా ఉండటమే కాక భయపడాల్సిన సీన్లకు సైతం ప్రేక్షకులు నవ్వుతున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఘోస్ట్ షిప్ అనే సూపర్ హిట్ హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకున్న భూత్ కనీసం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయింది. దీని దెబ్బకు ఘోస్ట్ సెకండ్ పార్ట్ 2ని బయ్యర్లకు ఫ్రీగా ఇవ్వక తప్పదని అప్పుడే వార్తలు వస్తున్నాయి. విక్కి కౌశల్ లాంటి వర్సటైల్ యాక్టర్ కు ఇలాంటి డిజాస్టర్ రావడం అతని అభిమానులకు బాధ కలిగించేదే. ఒకప్పుడు భూత్ టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ సూపర్ క్లాసిక్ తీస్తే దానికి రివర్స్ లో ఈ భూత్ తేడా కొట్టేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి