iDreamPost

విత్తనాల పార్శిల్‌ వచ్చిందా.. జాగ్రత్త!

విత్తనాల పార్శిల్‌ వచ్చిందా.. జాగ్రత్త!

ఆన్‌లైన్‌ వ్యాపారం విస్తృత మయ్యాక ప్రతీ వస్తువును అక్కడినుంచే తెప్పించుకోవడం అలవాటు బాగా పెరిగింది. హెయిర్‌ పిన్ను మొదలకుని తినే ఆహారం వరకు కొనుక్కునేందుకు ఇప్పుడు అనుసరిస్తున్నది ఆన్‌లైన్‌ విధానమే. జనానికి సౌలభ్యం పెంచుతుండడంతో దీనికి లభిస్తున్న ఆదరణ ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు విద్రోహశక్తులకు కూడా ఇదే అవకాశం కాబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే వస్తువులు ఏ మాత్రం ఉపయోగపడకపోయినా వాటిని తిరిగి పంపించడమో, పక్కన పడేయమో చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో మీరు ఏ మాత్రం ఆర్డరు చేయకుండా విత్తనాలు వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యంగా పాడేయొద్దంటూ కేంద్ర వ్యవసాయశాఖ హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మనం ఆర్డరు చేస్తే మాత్రమే మనకు సంబంధించిన వస్తువు పార్శిల్‌ వస్తుంది. కానీ మనం ఏ విధమైన ఆర్డరు చేయకుండానే కొన్ని రకాల విత్తనాలు పార్శిల్‌ రూపంలో దేశంలోని వివిద ప్రదేశాలకు వస్తున్నాయని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. గుర్తు తెలియని ప్రదేశాల నుంచి వస్తున్న ఈ పార్శిల్‌ అనుమానాస్పదంగా ఉండడంతోపాటు, విత్తనాలు వస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఈ అనుమానాలకు కారణాలు కూడా లేకపోలేదు.

ఉదాహరణకు ఒక దేశంలో నామమాత్రంగా ఉండే ఒక మొక్క వేరే దేశంలో అక్కడి వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతగా అంటే దానిని నియంత్రించలేని స్థితికి చేరుకుంటుంది. దీనికి అతి పెద్ద ఉదాహరణగా పార్ధీనీయంగడ్డి/ఇందిరమ్మగడ్డి/ ముత్యాలచెట్టును చెప్పొచ్చు. దేశంలోని వివిధ ప్రదేశాల్లో పలు పేర్లతో ఈ గడ్డిజాతి మొక్కను పిలుస్తుంటారు.

ఇందిరాగాంధీ హయాంలో ఏర్పడిన కరువునుంచి దేశాన్ని కాపాడేందుకు గోధుమలను దిగుమతి చేసుకున్నప్పుడు ఈ గడ్డిమొక్క మనదేశానికి వచ్చిందని చెబుతారు. ఆ తరువాత ఇక్కడ విస్తృతమైపోయింది. పంట మొక్కలకంటే ఏపుగా పెరుగుతుంది. కలుపుమందుకు కూడా చావు. దీంతో ఇక్కడి రైతులకు తీవ్ర ఇబ్బందులకు కారణమవుతోంది. ఇదే రీతిలో మరేదైనా మొక్కల విత్తనాలను మనదేశానికి కావాలనే ఇప్పుడు పంపిస్తున్నారా? అన్న సందేహాలను కూడా కేంద్ర వ్యవసాయశాఖ వ్యక్తం చేస్తోంది. అంతే కాకుండా విత్తనాల ద్వారా దేశంలోని మొక్కలకు వ్యాధులు వ్యాప్తికి కూడా కారణంగా కావొచ్చన్నది కూడా కారణంగా తోస్తోంది. ఏది ఏమైనా మనం ఆర్డరు పెట్టకుండా వచ్చిన పార్శిల్, అది కూడా విత్తనాలు వంటివి ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాద్యత ప్రజలపై ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి