iDreamPost

బావా మరదళ్ల కన్నీళ్లు – సునామి కలెక్షన్లు – Nostalgia

బావా మరదళ్ల కన్నీళ్లు – సునామి కలెక్షన్లు – Nostalgia

నిజ జీవితంలో బంధుత్వాల మధ్య ఉన్న భావోద్వేగాలను సరైన రీతిలో చూపించగలిగితే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. సరైన మోతాదులో డ్రామా పండాలి. అప్పుడే ప్రేక్షకుడు కథలో ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ మళ్ళీ మళ్ళీ థియేటర్ కు వస్తాడు. దానికో మంచి ఉదాహరణ బావా మరదళ్ళు, ఆ విశేషాలు చూద్దాం. 1983. కాస్త ఫామ్ తగ్గిందేమోనని అనుమాన పడుతున్న టైంలో దేవత లాంటి బ్లాక్ బస్టర్ తో శోభన్ బాబు మరోసారి తన సత్తా చాటారు. చిరంజీవి లాంటి అప్ కమింగ్ హీరోతో ఖైదీ ఇండస్ట్రీ హిట్టు కొట్టి ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిలో పడ్డారు దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి. అప్పుడు కుదిరింది ఆ కాంబినేషన్.

సినిమా రంగం మీద ఫ్యాషన్ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన నరసింహారావు నిర్మాతగా మొదటి చిత్రం తన అభిమాన హీరో శోభన్ బాబుతోనే తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే పార్ట్ నర్ గా చేసిన మంగళగౌరీ నష్టం తెచ్చింది. నిజానికి ఆ టైంలో ఆయన వద్ద పెద్దగా డబ్బు లేదు. కానీ ఏదో ధైర్యం. సన్నిహితుడైన రచయిత సత్యమూర్తి సహాయంతో ప్రాజెక్ట్ కి రూపకల్పన చేశారు. ప్రకటించగానే బయ్యర్ల నుంచి అడ్వాన్స్ లు వచ్చేశాయి. తమిళంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన యంగేయో కెట్ట కురళ్ అక్కడ ఓ మాదిరిగా ఆడింది. దాన్ని మన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు కీలక మార్పులు చేసి బావా మరదళ్ళు స్క్రిప్ట్ సిద్ధం చేశారు సత్యమూర్తి. ఇరవై నాలుగు లక్షల్లో బడ్జెట్ పూర్తయ్యింది.

సుహాసిని, రాధికా హీరోయిన్లుగా మురళీమోహన్, రావుగోపాల రావు, అల్లు, నూతన్ ప్రసాద్, గుమ్మడి, అన్నపూర్ణ, శ్రీలక్మి, అన్నపూర్ణ తదితరులు ప్రధాన తారాగణంగా తీసుకున్నారు. చక్రవర్తి సంగీతం సమకూర్చిగా నవకాంత్ ఛాయాగ్రహణం అందించారు. బావా మరదళ్ల మధ్య ఆపేక్ష, అపార్థాలు, అనుబంధాలను చూపించిన తీరుకి ప్రేక్షకులు కదిలిపోయారు. 1984 ఫిబ్రవరి 2న విడుదలైన బావామరదళ్ళు ఘనవిజయం సాధించి 16 కేంద్రాల్లో వంద రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్లకు కనక వర్షం కురిసింది. ఫ్యామిలీలతో థియేటర్లు కిటకిటలాడాయి. ఆడాళ్ళు ఏకంగా కర్చీఫ్ లు పెట్టుకుని మరీ ఏడ్చేవారు. తర్వాత నరసింహారావుకు శోభన్ బాబుకి ఎంత బాండింగ్ కుదిరిందంటే తర్వాత మరో అయిదు సినిమాలు ఆయనతోనే తీసేంతగా.

ALSO READ – RC 15లో క్రేజీ అట్రాక్షన్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి