iDreamPost

ఇది లైబ్రరీ కాదు సెలూన్….

ఇది లైబ్రరీ కాదు సెలూన్….

ఈ ఆధునిక యుగంలో సెలూన్ నడపాలంటే కావాల్సిన ముఖ్య సామగ్రి, సరంజామా ఏంటి? ముందుగా ఏసీ, తర్వాత కష్టమర్ వినోదం కోసం టీవీ తప్పనిసరి, లేకుంటే కస్టమర్లు విని ఆనందించడానికి మ్యూజిక్ సిస్టం కూడా సెలూన్లలో అమర్చడం సాధారణ విషయమే….. కానీ వీటికి భిన్నంగా టీవీ లేకుండా సెలూన్ షాప్ నడుపుతున్నాడో వ్యక్తి.. టీవీల్లేని సెలూన్ షాపులు దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి.. కానీ సెల్ ఫోన్ నిషేధం ఉండి, లైబ్రెరీ కూడా ఉన్న సెలూన్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందంటారా? ఉండదని సమాధానం వస్తుంది.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ వివరాలు పూర్తిగా తెలియాలి అంటే తమిళనాడులోని తూత్తుకుడి వెళ్లాల్సిందే..

తమిళనాడులో తూత్తుకుడిలో పాన్ మరియప్పన్ అనే వ్యక్తి సెలూన్ షాప్ నడుపుతున్నాడు. దేశంలో ఎందరో సెలూన్ షాపులు నడుపుతున్నారు,మరియప్పన్ సెలూన్ షాపులో ఉన్న ప్రత్యేకత దేశంలో ఏ ఒక్క సెలూన్ షాపులోనూ లేదు. అంతగా ఆశ్చర్య పరిచే విషయం ఏమంటే ఆ సెలూన్ షాప్ లో టీవీ ఉండదు..టీవీ లేకపోవడం కూడా వింతేనా అనుకోకండి. దేశంలో ఎన్నో సెలూన్ షాపుల్లో టీవీలు ఉండవు. దానికి బదులుగా కస్టమర్ల వినోదం కోసం ఏవో ఒకటి రెండు పేపర్లు అందుబాటులో ఉంచి మంచి మ్యూజిక్ సిస్టం పెట్టి మాంచి ఊపొచ్చే పాటలు పెట్టి కస్టమర్లకు వినోదాన్ని అందించే షాపులు దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.

కానీ మరియప్పన్ సెలూన్ లో టీవీ,మ్యూజిక్ సిస్టం లాంటివి ఏవీ ఉండవు.. తన సెలూన్ కి వచ్చే కస్టమర్లకోసం ప్రత్యేకించి సెలూన్ లోపల లైబ్రరీనే ఏర్పాటు చేసాడు మరియప్పన్.. తన షాపులో కస్టమర్లు చదువుకోవడానికి అనువుగా పేపర్లు మేగజైన్స్ తో పాటుగా ఎన్నో పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాడు.. వచ్చిన కస్టమర్లు హాయిగా అక్కడ కూర్చుని తమకి నచ్చిన మేగజైన్స్, పుస్తకాలు కావాల్సినంత సేపు చదువుకోవచ్చు.బుక్స్ చదువడాన్ని ప్రోత్సహించడం కోసం సెలూన్ లో టీవీ ఏర్పాటు చేయలేదు, దానితో పాటుగా సెలూన్లో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని నిషేధించాడు. పైగా అక్కడకొచ్చి బుక్స్ చదువుకునే వారికి సెలూన్ చార్జెస్ లో 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు.. దీంతో బుక్ లవర్స్ మురిసిపోతున్నారు. మరియప్పన్ సెలూన్ కమ్ లైబ్రెరీకి వెళ్లి తమకు ఇష్టమైన బుక్స్ చదువుకుని తలపై ఉన్న భారంతో పాటు మనసులో ఉన్న భారాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు పుస్తక ప్రేమికులు..

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం అన్నట్లుగా,పుస్తక పఠనం కనుమరుగవుతున్న ఈ కాలంలో కూడా పుస్తక పఠనానికి ప్రాధాన్యత నిస్తూ సెలూన్ లో లైబ్రెరీని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఒక మంచి పుస్తకం వందమంది గొప్ప స్నేహితులతో సమానం, కావున పుస్తక పఠనం వల్ల మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది.. ఏది ఏమైనా తన లాభం ఆశించకుండా ప్రజలకు మేలు కలిగేలా సెలూన్ ని కాస్త లైబ్రెరీగా మార్చిన మరియప్పన్ అభినందనీయుడే కదా….

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి