iDreamPost

బంగ్లా-ఆఫ్ఘన్ టెస్ట్ మ్యాచ్.. 89 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన బంగ్లాదేశ్!

  • Author Soma Sekhar Published - 05:40 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 05:40 PM, Sat - 17 June 23
బంగ్లా-ఆఫ్ఘన్ టెస్ట్ మ్యాచ్.. 89 ఏళ్ల క్రికెట్ చరిత్రను తిరగరాసిన బంగ్లాదేశ్!

టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ జట్టు 89 ఏళ్ల రికార్డును తిరగరాసింది. ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు బంగ్లా బెబ్బులులు. ఇక ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలతో చెలరేగాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో. దాంతో టెస్ట్ మ్యాచ్ వన్ సైడ్ గా ముగిసింది. 21వ శతాబ్దంలో ఇదే అతిపెద్ద విజయం కావడం మరో విశేషం. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. వన్ సైడ్ గా ముగిసిన ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 546 పరుగుల భారీ తేడాతో విజయ కేతనం ఎగరవేసింది బంగ్లా టీమ్. ఇక ఈ విజయంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో గత 89 ఏళ్లలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా బంగ్లా రికార్డులకు ఎక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓవరాల్ గా ఇది మూడో అతిపెద్ద విజయం కావడం విశేషం.

ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే? 21వ శతాబ్దంలో ఇదే అతిపెద్ద విజయం. ఇక ఈ మ్యాచ్ లో.. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. దాంతో 546 రన్స్ తేడాతో బంగ్లా విజయం సాధించింది. గతంలో 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ఆ తర్వాత 1932లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. తాజా గెలుపుతో బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ లో అతిపెద్ద విజయం సాధించిన మూడో జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 146 రన్స్, రెండో ఇన్నింగ్స్ లో 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో 382 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 425/4 పరుగులకు డిక్లేర్ చేసింది. రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ బాదిన షాంటోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి