iDreamPost

బ్యాన్ చైనా..! ప్ర‌చార జోరు!!

బ్యాన్ చైనా..! ప్ర‌చార జోరు!!

స‌రిహ‌ద్దుల్లో చైనా అవ‌లంభిస్తున్న తీరు.. భార‌త సైనికుల వీర మ‌ర‌ణంతో.. భార‌తీయులు తీవ్ర‌మైన ఆగ్ర‌హ ఆవేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బ్యాన్ చైనా అంటూ ప్ర‌చార జోరు హోరెత్తిస్తున్నారు. ఆ దేశ వ‌స్తువుల‌ను కొన‌రాదంటూ చాలా మంది నిర్ణ‌యించుకుంటున్నారు. అమ‌ర‌వీరుల సాక్షిగా ప్ర‌మాణాలు కూడా చేస్తున్నారు. కొనేవారే కాదు.. కొంద‌రు వ్యాపారులు కూడా చైనా దేశానికి చెందిన వ‌స్తువుల అమ్మ‌రాద‌ని నిశ్చ‌యించుకుంటున్నారు. గాల్వాన్ లోయలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త జ‌వాన్లు 20 మంది వీర మరణం పొందడంతో హైదరాబాదీ వ్యాపారులు విప్లతాత్మ‌క నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాజ‌ధానిలో వ్యాపార‌ప‌రంగా ర‌ద్దీ ప్రాంతాలైన బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్‌ఖానాకు చెందిన వ్యాపారులు ఇకపై చైనా ఉత్పత్తులను విక్ర‌యించ‌బోమ‌ని నిర్ణయం తీసుకున్నారు. హోల్ సేల్, రిటైల్ వ్యాపారులంద‌రూ ఇది పాటించాల‌ని గురువారం నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వ సంస్థ‌ల సైతం…

ప్ర‌జ‌ల ఆవేశాలు.. వ్యాపారుల నిర్ణ‌యానికి తోడు.. కేంద్ర‌ ప్ర‌భుత్వ సంస్థ‌లు సైతం కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, భారత రైల్వే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లాంటివి ఇప్పటికే కాంట్రాక్టులు.. ఇతరత్రా వాటిలో చైనాకు సంబంధిత ఉత్ప‌త్తుల వాడ‌కాన్ని నిషేధించాల‌ని నిర్ణయం తీసుకున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థపై బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్‌తో భారత రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) 2016లో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను రైల్వే రద్దు చేసుకుంది. కాన్పూర్ దీనదయాళ్ సెక్షన్‌కు సంబంధించి 417 కిలోమీటర్ల మేర సిగ్నల్స్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్ట్ విలువ రూ. 471 కోట్లు. మ‌రోవైపు… 4జీ అప్‌గ్రేడ్ నిమిత్తం ఉపకరణాలను వినియోగించవద్దని బీఎస్ఎన్ఎల్‌ను కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆదేశించిన‌ట్లు తెలిసింది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆగడాలకు నిరసనగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ తోపాటు వాటి పరిధిలోని విభాగాలన్నీ సాధ్యమైనంత వరకు మేకిన్ ఇండియా ఉత్పత్తులనే వినియోగించాలని సూచించింది. బాయ్‌కాట్ చైనా పేరుతో కొందరు వ్యక్తిగతంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

యాప్ ల‌పై…

అలాగే.. చైనాతో లింక్ ఉన్న 52 మోబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని లేదా.. వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి  భారత ఇంటెలిజెన్స్ అధికారులు  సూచనలు చేశారు. ఈ జాబితాలో జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్, క్లీన్ మాస్టర్ వంటి మరో 52 అప్లికేషన్లను ఇంటెలిజెన్స్ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు. వాటిలో టిక్ టాక్ కు ఎప్ప‌టి నుంచో యువ‌త‌లో మంచి క్రేజ్ ఉంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో జూమ్ యాప్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటెలిజెన్స్ అధికారుల సూచ‌న‌ల‌కు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసిన‌ట్లుగా కానీ.. అధికారిక ప్ర‌క‌ట‌న కానీ.. ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. జూమ్ యాప్ శ్రేయ‌స్క‌రం కాద‌ని మాత్రం గ‌తంలోనే ప్ర‌క‌టించాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి