iDreamPost

బాలయ్యకు చెప్పకుండా బాబూరావు వెళ్లుంటాడా..?

బాలయ్యకు చెప్పకుండా బాబూరావు వెళ్లుంటాడా..?

లాంఛనం పూర్తయింది. సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య స్నేహితుడు, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడైన బాబూరావు పార్టీ మారడంతో టీడీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. ఆది నుంచీ వెన్నంటి ఉంటూ.. ఎమ్మెల్యే సీటు కూడా ఇప్పించిన బాలయ్య అనుమతి లేనిదే కదిరి బాబూరావు పార్టీ మారారా..? అంటే తమ్ముళ్లే కాదంటున్నారు.

మీ అమ్మగారి వయస్సు ఎంత..?
70 ఏళ్లు అండీ..
బోరు కొట్టిందని మార్చలేదేం..?
అమ్మనెలా మారుస్తామండీ..
మరి అమ్మలాంటి పార్టీని ఎలా మారుస్తావ్‌ రా..? … ఇదీ 2014లో వచ్చిన లెజెండ్‌ సినిమాలోని ఓ డైలాగ్‌. ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రంలో బాలకృష్ణ తనదైన శైలిలో ఈ డైలాగ్‌ ప్రయోగిస్తారు. బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేస్తున్న తమ్ముళ్లు.. తన స్నేహితుడు పార్టీ మారుతుంటే.. బాలయ్య చూస్తూ ఊరుకోరంటున్నారు. పార్టీ మారడంపై బాలయ్యను కలసి అంతా వివరించిన తర్వాతే బాబూరావు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

బాబూరావు పార్టీ మారడం వెనుక బలమైన కారణం ఉంది. ఆ కారణం బాలయ్యకు కూడా తెలుసు. కాబట్టే బాబూరావు నిర్ణయానికి తలూపి ఉంటారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేయడం కదిరి బాబూరావుకు ఏ మాత్రం ఇష్టంలేదు. తన సిట్టింగ్‌ స్థానం అయిన కనిగిరిని వదిలి మరోచోటకు వెళ్లడంపై ఆయన మల్లగుళ్లాలు పడ్డారు. తన స్థానం తనకే వచ్చేలా.. బాలయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి చేయించారు. వైఎస్సార్‌సీపీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి సాధ్యం గాక టీడీపీలోకి వచ్చిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కోసం తన సీటును త్యాగం చేయాల్సి రావడంపై బాలయ్య వద్ద బాబూరావు పంచాయతీ పెట్టారు. దర్శిలో గెలవలేనని, కనిగిరిలో అయితే మళ్లీ తప్పక గెలుస్తానని చెప్పినట్లు ఆప్పట్లో ప్రచారం జరిగింది.

కదిరి బాబూరావుకు సిట్టింగ్‌ సీటునే ఖాయం చేసేందుకు బాలయ్య తన బావ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. బాలయ్య ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఉగ్రనరసింహారెడ్డిని దర్శి నుంచి పోటీ చేయించాలని ఒక దశలో నిర్ణయించారు. ఈ విషయం ఉగ్ర నరసింహారెడ్డికి కూడా చెప్పారు. నామినేషన్‌ గడువు చివర వరకూ ఈ తంతు నడిచింది. కానీ చివరికి బాబూరావు సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దర్శిలో పోటీ చేసి ఓడిపోయారు. కనిగిరిలోనూ ఉగ్రనరసింహారెడ్డి ఓడిపోయారు. రెండు చోట్లా ఓడిపోవడంతో టీడీపీ పరిస్థితి రెంటీకి చెడ్డ రేవడిలా తయారైంది. చంద్రబాబు ప్లాన్‌ ఫెయిల్‌ అయింది. తన స్నేహితుడు ఓడిపోవడంతో బాలయ్య కూడా ఆవేదన వ్యక్తం చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా పార్టీ మారడంపై కదిరి బాబూరావు నిర్ణయాన్ని బాలయ్య వ్యతిరేకించలేదనే చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి