iDreamPost

కోటి ఆశలతో కాలేజీలో చేరింది.. నాలుగురోజుల్లో ఊహించని విషాదం

కోటి ఆశలతో కాలేజీలో చేరింది.. నాలుగురోజుల్లో ఊహించని విషాదం

కోటి ఆశలతో కళాశాలలో చేరింది. కాలేజీలో చేరి చదువుకుంటున్నానన్న సంతోషం ఆ విద్యార్థినికి నాలుగురోజులైనా నిలవలేదు. ఏమైందో తెలీదు గానీ.. కాలేజీ హాస్టల్ లో బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కలసపాడు మండలం నల్లగొండపల్లెకు చెందిన ముద్దం వెంకటేశ్వర్లు, కళావతికి కుమార్తె సుజాత, కుమారుడు ప్రదీప్‌ ఉన్నారు. సుజాత (17) గతేడాది ఇంటర్ పూర్తి చేసింది. చదువుకోవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పగా.. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. ఈనెల 13న కడప నగరంలోని ఊటుకూరులో ఉన్న రామిరెడ్డి ఫార్మసీ అండ్‌ ఫిజియోథెరపీ కళాశాలలో బీ.ఫార్మసీలో చేర్పించారు. కాలేజీ హాస్టల్ లోనే ఉంటోంది సుజాత.

ఈనెల 16వ తేదీ ఉదయం 7.30 గంటలకు సుజాత హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్థిని మొబైల్ నుంచి తల్లికి ఫోన్ చేసి మాట్లాడింది. అదే రోజు రాత్రి ఆ విద్యార్థిని సుజాత ఉదయం ఫోన్ చేసిన నంబర్ కే కాల్ చేసి.. సుజాత హాస్టల్ లో వెంటిలేటర్ కొక్కేనికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. దీంతో సుజాత మేనమామ, బాబాయ్‌ కలిసి ఆగమేఘాలమీద కాలేజీకి చేరుకున్నారు. హాస్టల్ లో సుజాత మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. మిగతా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి.. కాలేజీకి పిలిపించారు. పోలీసులు సుజాత మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కూతురి బలవన్మరణంపై తండ్రి వెంకటేశ్వర్లు స్పందించారు.

తన కూతురు ఇంటివద్ద కూడా ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదన్నారు. తమ ఇంటి ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో.. కూతుర్ని ఆలస్యంగా కాలేజీలో చేర్పించామన్నారు. చదువుకోవాలని సుజాత ఎన్నో కలలు కన్నదని, కోటి ఆశలతో కళాశాలలో చేరిన కూతుర్ని నాలుగురోజులకే విగతజీవిగా చూస్తామనుకోలేదని ఆవేదన చెందారు. శుక్రవారం కడపకు వచ్చి మాట్లాడి వెళదామనుకునేలోపే ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేదన్నారు. కాగా.. విద్యార్థిని సుజాత మరణంపై తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానాలున్నా ఫిర్యాదులో పేర్కొంటే.. ఆ దిశగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు సుజాత బలవన్మరణంపై విద్యార్థి, ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. విద్యార్ధి సుజాత మృతికి కారకులైన వారిని శిక్షించాలని వివిధ సంఘాల నేతలు కోరారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి