iDreamPost

అయోధ్య రామ మందిరం కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్!

  • Author singhj Published - 05:10 PM, Fri - 21 July 23
  • Author singhj Published - 05:10 PM, Fri - 21 July 23
అయోధ్య రామ మందిరం కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్!

అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ముస్తాబవుతోంది. ఇప్పుడీ ఆలయానికి తుదిరూపం ఇచ్చేందుకు తీవ్రంగా కసరత్తులు జరుగుతున్నాయి. కొన్ని నెలల తర్వాత శ్రీ రాముడు తన గొప్ప ఆలయంలో కొలువు దీరనున్నాడు. ఈ మహా దేవాలయం నిర్మాణం కోసం రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా రామాలయ నిర్మాణానికి సంబంధించిన కొత్త ఫొటోలను శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆలయాన్ని ఎలా నిర్మిస్తున్నారు, కళాకారుల అపురూప ప్రతిభతో పాటు అద్భుతమైన శిల్ప సౌందర్యం లాంటివన్నీ చూడొచ్చు.

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం మొదటి దశలో సుమారు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాల మీద అద్భుతమైన శిల్పాలు కనిపిస్తున్నాయి. కళాకారులు స్తంభాల మీద విగ్రహాలను చెక్కే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పనులు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయని చెప్పొచ్చు. మందిర నిర్మాణంలో పూర్తిగా రాళ్లను వినియోగిస్తున్నారు. ప్రతి రాయిపై అద్భుతమైన శిల్పాన్ని చెక్కుతూ రాళ్లకు ప్రాణం పోస్తున్నారు కళాకారులు. రామ్​లీలా స్వామి కొలువుదీరే గర్భగుడి వెడల్పు దాదాపు 20 అడుగులు అని తెలుస్తోంది.

దేవాలయం తొలిదశలో ఉండే 167 స్తంభాలను పింక్ ఇసుకరాయితో తయారు చేస్తున్నారు. వీటిపై నర్తకి, హనుమంతుడు, వానరసేన, శివుడి విగ్రహాలను చెక్కుతున్నారు. ఇకపోతే, అయోధ్య రామాలయాన్ని 2024, జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. మహత్తర రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా 10 రోజుల పాటు ఆచార, వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. మందిర ప్రారంభోత్సవం, ప్రతిష్టాపన కార్యక్రమాలను దేశ, విదేశాల్లో టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నృపేంద్ర చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి