iDreamPost

హిట్లు మాత్రమే తెలిసిన ‘విజయాల’ ‘శివ

హిట్లు మాత్రమే తెలిసిన ‘విజయాల’ ‘శివ

సాధారణంగా ఇండస్ట్రీలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ కొట్టడం కొత్తేమి కాదు. రామ్ గోపాల్ వర్మ శివతో మొదలుకుని ఎస్వి కృష్ణారెడ్డి రాజేంద్రుడు గజేంద్రుడుతో కంటిన్యూ చేస్తే ఇప్పటి అనిల్ రావిపూడి పటాస్ దాకా ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. అదే ఆ సక్సెస్ ని నిలబెట్టుకుంటూ తర్వాతి సినిమాలు కూడా విజయవంతం చేయడం అందరి వల్లా జరిగే పని కాదు. ద్వితీయ విఘ్నమో లేదా థర్డ్ బ్రేకో ఏదో ఒకటి యావరేజ్ లేదా ఫ్లాప్ రూపంలో అందుకున్న వాళ్ళే ఎక్కువ. కానీ దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇప్పటి దాకా తీసిన నాలుగు సినిమాలతో ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇవ్వడం అరుదని చెప్పాలి.

పరిశ్రమలో సంభాషణల రచయితగా కెరీర్ మొదలుపెట్టిన కొరటాల శివ తక్కువ టైంలోనే మెగా ఫోన్ పట్టే ఛాన్స్ కొట్టేశారు. ప్రభాస్ హీరోగా రూపొందించిన ‘మిర్చి’లో తీసుకున్నది మరీ గొప్పగా చెప్పుకోలేని కథ కానప్పటికీ తనదైన శైలిలో కొత్త తరహా ట్రీట్మెంట్ ఇచ్చి హీరోయిజం ఎలివేషన్లో మరో కోణాన్ని ఆవిష్కరించిన తీరు ప్రశంసలతో పాటు వసూళ్లను కూడా తెచ్చిపెట్టింది.హీరోగా కొంత బ్యాడ్ టైం నడుస్తున్న సమయంలో మహేష్ బాబు ఇచ్చిన శ్రీమంతుడు అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు శివ. దాంతో తిరగరాసిన రికార్డులు ఇతర హీరోలు బద్దలు కొట్టడానికి కొంత టైం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ సైతం తారక్ కు కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

తనతో బాగా సింక్ అయిన శివను వదల్లేక మళ్ళీ భరత్ అనే నేను రూపంలో ఆఫర్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ . కట్ చేస్తే ఇదీ బ్లాక్ బస్టరే. దెబ్బకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆచార్య కోసం పిలుపు. వివిధ కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ దీని మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొరటాల శివలో ప్రత్యేకత ఒకటే. కమర్షియల్ సూత్రాలను మిస్ చేయకుండా సొసైటీకి పనికొచ్చే మెసేజ్ ని అందులో జొప్పించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆలోచింపజేసేలా కథల కన్నా ఎక్కువ కథనం మీద శ్రద్ధ పెట్టడం.

అందుకే చేసింది నాలుగు సినిమాలే అయినా సందేశం లేని ప్రయత్నం కొరటాల శివ ఇప్పటిదాకా చేయలేదు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులను దగ్గర చేసుకోగలిగారు. ఇప్పుడు స్టార్ హీరోలు అడిగి మరీ డేట్స్ అడిగే స్థాయికి చేరుకోవడం కన్నా సాధించాల్సింది ఏముంటుంది. అందుకే ఇవాళ పుట్టినరోజుని అందరు హీరోల ఫ్యాన్స్ ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నారంటే ఇంత కన్నా వేరే చెప్పాలా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి