iDreamPost

కేసీఆర్ కు ఆర్మీ అభినంద‌న‌లు

కేసీఆర్ కు ఆర్మీ అభినంద‌న‌లు

రోడ్డు మార్గాన సూర్యాపేట వెళ్లి… విద్యానగర్‌లో ఉన్న క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబ స‌భ్యుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా వెళ్లి పరామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. కుటుంబ సభ్యులను ఓదార్చి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు భార్యకు రూ.4 కోట్లు, ఆయన తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కులను అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 చదరపు గజాల స్థలం, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి (గ్రూప్‌-1)గా ఉద్యోగ నియామక పత్రాలను సంతోష్‌బాబు భార్య సంతోషికి స్వయంగా అందజేశారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోనా ఇచ్చారు. ఆ కుటుంబం బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు. ఓ వీర సైనికుడి కుటుంబం ప‌ట్ల ఆయ‌న చూపిన చొర‌వ‌కు ఆర్మీ అభినంద‌న‌లు తెలిపింది.

క‌ల్న‌ల్ కుటుంబానికి అండ‌గా నిలిచిన కేసీఆర్ కు డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావ‌ల్ స్టాఫ్ వైస్ అడ్మిర‌ల్ ఎంఎస్ ప‌వార్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ.. ఢిల్లీ నుంచి ఆయ‌న‌కు లేఖ రాశారు. వీర మ‌ర‌ణం పొందిన ఇత‌ర రాష్ట్రాల సైనికుల‌కు కూడా ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. భార‌త సైనికులు దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణ త్యాగాల‌కు ఎప్పుడూ వెన‌కాడ లేద‌ని తెలిపారు. కేసీఆర్ చూపిన ఈ ఉదార‌త ఇత‌ర రాష్ట్రాల‌కూ ఆద‌ర్శ‌ప్రాయంగా మారుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఇటువంటి చ‌ర్య‌లు సైనికుల్లో మ‌నో బ‌లాన్ని పెంచుతాయ‌ని, త‌మ‌కే దైనా దేశం వారికి అండ‌గా ఉంటుంద‌నే న‌మ్మ‌కాన్ని క‌ల‌గిస్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఒక సీఎం వంద‌ల కిలోమీట‌ర్లు కొన్ని గంట‌ల పాటు ప్ర‌యాణించి ఓ వీర సైనికుడి కుటుంబాన్ని నేరుగా వెళ్లి క‌ల‌వ‌డం చాలా సంతోష‌క‌ర‌మ‌న్నారు. ఇది ఆర్మీ ప‌ట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమ‌ను తెలియ‌జేస్తోంద‌ని చెప్పారు. మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఈ విష‌యంలో చొర‌వ చూపార‌ని ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. కోరుకొండ సైనిక పాఠ‌శాల‌ను ఒక సంద‌ర్శించాల‌ని సీఎం కేసీఆర్ ను ఎంఎస్ ప‌వార్ ఆహ్వానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి