iDreamPost

అనుమతి ఇస్తే … పీఓకే మనదే..

అనుమతి ఇస్తే … పీఓకే మనదే..

పాక్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)పై ఆర్మీ నూతన చీఫ్ ముకుంద్ నరవనే కుండబద్దలు కొట్టారు. పీఓకే మనదేనని, ఆపరేషన్ పీఓకే నిర్వహించేందుకు తాము సిద్ధమేనని ముకుంద్ నరవనే చెప్పారు. ఈ రోజు ఢిల్లీ లో మీడియా సమావేశంలో నరవనే మాట్లాడుతూ.. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంటు నిర్ణయించి, తమకు అనుమతి ఇస్తే.. ఆ ప్రాంతం తిరిగి మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందితే తక్షణమే పీఓకే కోసం తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న ముప్పుపై మాట్లాడుతూ ఎల్ఓసీ వెంబడి అత్యంత అప్రమత్తత పాటిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందుతున్నాయని, వాటిని సీరియస్‌గా పరిగణించి పాకిస్థాన్ ప్రత్యేక బలగాలైన ‘బ్యాట్’ చర్యలకు ప్రతిచర్యలు చేపడుతూ సమర్ధవంతంగా తిప్పికొడుతుంటామని చెప్పారు.

పాకిస్థాన్ సరిహద్దుల్లో బలగాల రీ-బ్యాలెన్స్‌పై మాట్లాడుతూ.. తూర్పు, పశ్చిమ సరిహద్దులు రెండింటికీ సమప్రాధాన్యం ఉన్నందున రీ-బ్యాలెన్సింగ్ అనేది అవసరమేనని అన్నారు. భారత ఆర్మీ ప్రాధాన్యతలపై మాట్లాడుతూ, చొరబాట్లను తిప్పికొట్టడం తాత్కాలిక ప్రాధాన్యతాంశమైతే, సాంప్రదాయ యుద్ధం అనేది దీర్ధకాలిక ప్రాధాన్యతాంశం అవుతుందన్నారు. అందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే ఇండియన్ డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్‌కు, చైనా వెస్ట్రన్ కమాండ్‌కు మధ్య హాట్‌లైన్ ఏర్పాటవుంటుందని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి