iDreamPost

ఏపీలో “యాప్” ల పంచాయతీ..!

ఏపీలో “యాప్” ల పంచాయతీ..!

ఏపీలో యాప్ లో పంచాయతీ మొదలైంది. అటు ఏపీఎస్ఈసీ, ఇటు ఏపీ సర్కార్ పోటా పోటీగా యాప్ లను తయారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకొచ్చిన కొత్త ప్రైవేట్ యాప్ తాజాగా ఏపీ సర్కార్, ఏపీఎస్ఈసీకి మధ్య కొత్త వివాదానికి తెరతీసింది. ఎస్ఈసీ కి కౌంటర్ గా వైసీపీ ఈ-నేత్రం పేరుతో యాప్ ను అందుబాటులో కి తీసుకుని వచ్చింది. పరిస్థితి చూస్తుంటే స్థానిక సమరం కంటే యాప్ సమరం రంజుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఎన్నికల నిర్వహణకు ఎవరి సలహా తీసుకోకుండా.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా దూకుడుగా, దురుసుగా.. యాప్ ను నిమ్మగడ్డ ఆవిష్కరించారు. ఎన్నికల్లో పారదర్శకతకు అంటూ టీడీపీకి ఫేవర్ చేసేందుకే ఈ యాప్ తెస్తున్నాడని వైసీపీ సర్కార్ ఆరోపిస్తోంది. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టు చప్పుడుకాకుండా యాప్ రూపొందించి, భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన ఆ యాప్ ను బుధవారం ఆవిష్కరించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శ్రీకాకుళం పర్యటనలో యాప్ ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించి అగ్గి రాజేశారు. దీంతో అసలు యాప్ తయారు చేసింది ఎవరు..? కంట్రోల్ కేంద్రం ఎక్కడుంది.. ఎవరు పర్యవేక్షిస్తారు? సిబ్బంది ఎవరు? తదితర వివరాలు బహిర్గతం కాకుండా గోప్యత పాటించడం అనేక అనుమనాలకు తావిచ్చింది. పూర్తి పారదర్శకతతో జరగాల్సిన ఎన్నికలకు వినియోగించే యాప్ ను అనుమతులు లేకుండానే ఆవిష్కరించేందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధమవ్వడం గమనార్హం.

మరోవైపు మొదటి నుంచి నిమ్మగడ్డ కదలికలపై అనుమానాలు ఉన్న ఏపీసర్కార్ కు ఈ యాప్ మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. టీడీపీకి మేలు చేసేందుకే యాప్ రూపొందించారంటూ ఆరోపణలు చేసింది కూడా. అంతేకాదు ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ – వాచ్ యాప్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోషన్‌కు నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ – వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటిషన్‌లో ప్రస్తావించింది. యాప్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే సర్కార్ కోర్టుకు వెళ్లడంపై నిమ్మగడ్డ స్పందిస్తూ అచ్చం రాజకీయ నాయకునిలా మాట్లడారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడంలో ఆశ్చర్యం లేదని, పిటిషన్ వేయకపోతేనే ఆశ్చర్యపోవాలంటూ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.

నిమ్మగడ్డ వైఖరి ఫక్తు రాజకీయ నాయకునిలా, రహస్యంగా, టీడీపీకి మేలు చేసే విధంగా ఉందన్న అనుమానంతో వైసీపీ పార్టీ పరంగా ఎస్ఈసీ నిమ్మగడ్డకు కౌంటర్ గా ఈ-నేత్రం పేరుతో యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం.. ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేసే సౌలభ్యం కల్పించింది. ఈ ఫిర్యాదులను పార్టీ పరంగా ఎస్ఈసీ కి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేసింది. ఈ-వాచ్ యాప్ విషయంలో సర్కార్ కోర్టు ఆశ్రయించడంపై వ్యంగ్యంగా స్పందించిన నిమ్మగడ్డ, మరి ఈ వైసీపీ యాప్ పై స్పందిస్తారా? స్పందించరా? వేచి చూడాలి. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వం ఒకవైపు, ప్రతిపక్షాలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వైపున నిలిచినట్లు కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి