iDreamPost

ప్లేస్ మారింది.. బుద్ధా, బోండా ఇప్పుడేం చేస్తారు..?

ప్లేస్ మారింది.. బుద్ధా, బోండా ఇప్పుడేం చేస్తారు..?

అసలు ఏం జరిగింది. దాడి ఎలా చేశారు.? అప్పుడు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు..? ఆ రోజు ఘటన తాలూకు వివరాలు చెప్పండి. మీపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తాం… అంటూ గుంటూరు జిల్లా పోలీసులు అడుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావులు మాత్రం ససేమిరా అంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని పోలీసులు కోరుతుంటే.. స్టేషన్‌కు మేము రానేరాము, మీపై మాకు నమ్మకంలేదంటూ టీడీపీ నేతలంటున్నారు. దీంతో మాచర్ల ఘటనపై పోలీసులు ముందుకు పోలేకపోతున్నారు.

టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నేత తురక కిషోర్‌పై సెక్షన్‌ 370 కింద కేసు పెట్టిన పోలీసులు ఆతన్ను రిమాండ్‌కు తరలించారు. ఆ కేసు విచారణకు బాధితుల వాగ్మూలం అవసరం కాగా.. మాచర్ల స్టేషన్‌కు వచ్చి వాగ్మూలం ఇవ్వాల్సిందిగా పోలీసులు బుద్ధా వెంకన్న, బొండా ఉమాలకు రెండు రోజుల క్రితం తాఖీదులు ఇచ్చారు. అయితే మాచర్లకు వెళితే తమను చంపేస్తారంటూ వారు రాబోమన్నారు. డీజీపీ కార్యాలయానికి వస్తామంటున్నారు.

టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతుండడంతో పోలీసులు మరో అవకాశం ఇచ్చారు. మాచర్ల అంటే భయపడుతుండడంతో ఈ సారి ప్లేస్‌ మార్చారు. ఈ నెల 21న గురజాల డీఎస్పీ కార్యాలయానికి రావాలంటూ తాజాగా నోటీసులు జారీ చేశారు. టీడీపీ నేతలు వెళ్లి వాగ్మూలం ఇస్తే కేసు విచారణ ముందుకు కదులుతుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుంది. విచారణకు సహకరించడంలేదన్న అపవాదు వస్తుంది. ఇలా జరిగితే.. తమపై దాడి చేసిన వారిని వైసీపీ ప్రభుత్వం రక్షిస్తోందనే విమర్శలు చేసే అవకాశం భవిష్యత్‌లో బొండా, బుద్ధాలకు ఉండదు. నేతలు ఓ సారి ఆలోచించుకుని వెళ్లడం మంచిదేమో…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి