iDreamPost

AP: స్టూడెంట్ నం 1 రియల్ సీన్.. జైలు నుంచే చదువు.. 2 రాష్ట్రాల్లో స్టేట్ ఫస్ట్..

  • Published Dec 30, 2023 | 11:10 AMUpdated Dec 30, 2023 | 12:13 PM

తెలిసో తెలియకో.. క్షణికావేశంలో చేసిన తప్పు వల్లనో తెలియదు కానీ.. ఆ యువకుడు జైలు పాలయ్యాడు. అయినా సరే చదువు మీద ఆసక్తితో.. జైలు నుంచే పీజీ పూర్తి చేశాడు. ఆ వివరాలు..

తెలిసో తెలియకో.. క్షణికావేశంలో చేసిన తప్పు వల్లనో తెలియదు కానీ.. ఆ యువకుడు జైలు పాలయ్యాడు. అయినా సరే చదువు మీద ఆసక్తితో.. జైలు నుంచే పీజీ పూర్తి చేశాడు. ఆ వివరాలు..

  • Published Dec 30, 2023 | 11:10 AMUpdated Dec 30, 2023 | 12:13 PM
AP: స్టూడెంట్ నం 1 రియల్ సీన్.. జైలు నుంచే చదువు.. 2 రాష్ట్రాల్లో స్టేట్ ఫస్ట్..

జూనియర్ ఎన్టీఆర్, దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేయని నేరానికి జైలుకు వెళ్లిన కథానాయకుడు.. అక్కడ నుంచే చదువును కొనసాగిస్తూ.. లాయర్ అవుతాడు. చివరకు తండ్రి కేసును తనే వాదించి.. నిర్దోషిగా విడిపిస్తాడు. జైలుకు వెళ్లినా సరే.. చదువు మీద తన ఆసక్తిని వదులుకోలేక ప్రత్యేక అనుమతితో కష్టపడి చదివి.. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకుంటాడు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు నిజంగానే జరుగుతున్నాయి. జైలు పాలై.. అక్కడి నుంచే తమ చదువును కొనసాగించి.. లక్ష్యాన్ని చేరుకుంటున్న వారి గురించి ఈ మధ్య తరచుగా వార్తలు చదువుతున్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇదే కోవకు చెందిన ఘటన వెలుగు చూసింది.

స్టూడెంట్‌ నంబర్‌ –1 సినిమాలో తరహా సీన్ ఒకటి ఆంధ్రప్రదేశ్, నంద్యాలలో చోటు చేసుకుంది. యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఓ యువకుడు జైలు నుంచే చదువు కొనసాగించి.. గోల్డ్ మెడల్ సాధించి.. రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అతడే నంద్యాల జిల్లా సంజామ­ల మండలం పేరుసోముల గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ. దూదేకుల నడిపి మాబుసా, మాబున్నీ కుమారుడు అయిన రఫీ.. 2014లో బీటెక్‌ చదువుతుండేవాడు.

ఆ సమయంలో ప్రేమ వ్యవహారంలో భాగంగా.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి హత్యకు కారకుడని భావించి రఫీ మీద పోలీస్‌ స్టేషన్‌లో హత్యకేసు నమో­దైంది. కోర్టులో విచారణ అనంతరం 2019 జూలై నెలలో రఫీకి జీవిత ఖైదు విధించారు. అప్పటి నుంచి కడప కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అను­భవిస్తున్నాడు రఫీ. ఖైదీలను సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సంకల్పించిన కడప జైలు అధికారులు.. అక్కడ చదువుపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించారు. పదో తరగతి పూర్తి చేసిన వారిని గుర్తించి.. వారిలో ఆసక్తి ఉన్న వారిని.. దూర విద్య కోర్సుల ద్వారా పై చదువులకు ప్రోత్సహించారు జైలు అధికారులు.

2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ర్యాంకు

ఇక జైలు శిక్షపడే నాటికే డిగ్రీ పూర్తి చేసిన మహమ్మద్‌ రఫీకి చదువుపై ఉన్న మక్కువను గుర్తించిన అప్పటి జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్, ఇతర జైలు అధికారులు పై చదువులు చదవడానికి అతనికి ప్రోత్సాహమందించారు. ఈ క్రమంలోనే 2020లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పీజీ చేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీలో అడ్మిషన్ పొందాడు మహమ్మద్‌ రఫీ. అతడి కోర్సుకు అవసరమైన వివిధ రకాల పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ ను సమకూర్చుకుని.. జైలు­లోనే నాలుగు గోడల మధ్య కష్టపడి చదువుకున్నాడు.

కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు 2022­లో రఫీ పరీక్షలు రాయడానికి తనకు అనుమతి ఇచ్చారు. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని యూ­ని­వర్సిటీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఎంఏ సోషియా­లజీ­లో మొదటి ర్యాంకుతో గోల్డ్‌ మెడల్‌ సాధించాడు రఫీ. జైలులో ఉంటున్న రఫీకి పీజీ పట్టా, గోల్డ్‌ మెడల్‌ ప్రదానం చేయాలని భావించిన యూ­ని­వర్సిటీ అధికారులు దీని గురించి జైలు అధికారు­లకు సమాచారం అందించారు. దాంతో కోర్టు అనుమతితో నాలుగు రోజులు రఫీకి బెయిల్‌ మంజూరు చేశారు.

ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌­ లోని అంబేడ్కర్‌ యూనివర్సిటీలో వైస్‌ చాన్స్‌లర్‌ జగదీశ్‌ ఆధ్వర్యంలో రఫీకి గోల్డ్‌ మెడల్‌ బహూకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ తాను జైలు పాలైనప్పటికీ చదువుపై ఉన్న మమకారంతో, పట్టుదలతో పీజీ సాధించా­నని తెలిపాడు. తన తల్లిదండ్రులకు ఈ గోల్డ్ మెడల్ అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు. జైలుకెళ్తే ఇక జీవితం అయిపోయిందనుకునే చాలా మందికి మహమ్మద్ రఫీ జీవితం ఆదర్శంగా నిలుస్తుంది. బయట స్వేచ్ఛగా జీవిస్తూ జైలు జీవితంలా ఉందని భావించే వారు ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. జైలులో ఉంటేనే ఆయన ఇంత సాధిస్తే.. బయట స్వేచ్ఛగా ఉన్న వారు ఇంకెంత సాధించగలరో ఆలోచించండి. మరి జైలులో ఉంటూ చదువుకుని గోల్డ్ మెడల్ సాధించిన మహమ్మద్ రఫీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి