iDreamPost

వర్షాలకు హైదరాబాద్ సిటీనే మునిగిపోయింది.. నువ్వో లెక్కా?: బొత్స సత్యనారాయణ

  • Author singhj Published - 05:57 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 05:57 PM, Fri - 28 July 23
వర్షాలకు హైదరాబాద్ సిటీనే మునిగిపోయింది.. నువ్వో లెక్కా?: బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల్లో ఎలక్షన్ హీట్ అప్పుడే కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా విమర్శల పర్వం కొనసాగుతోంది. జనసేన, టీడీపీ, బీజేపీలు అధికార వైసీపీపై ఆగ్రహ్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విపక్ష నేతల విమర్శలకు అధికార పార్టీ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తూ బిజీబిజీగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలకు దిగారు. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వానలు దంచికొడుతున్నాయి.

వర్షాల ధాటికి హైదరాబాద్​ నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు బొత్స సత్యనారాయణ. వర్షాలకు హైదరాబాద్ నగరమే మునిగిపోయిందని.. చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీ కూడా మునిగిందన్నారు బొత్స. నార్త్ ఇండియాతో పాటు దేశ రాజధాని ఢిల్లీ సిటీ నీటిలో మునిగిపోయిందన్నారాయన. చంద్రబాబు కూడా వచ్చే ఎలక్షన్స్​లో ఇలాగే మునిగిపోక తప్పదని బొత్స చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమ్మ ఒడి’ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాకపోతే సినిమా యాక్టర్లు వస్తారా అని బొత్స ప్రశ్నించారు. పేరెంట్స్ రావడం తప్పని తాను అనుకోవడం లేదన్నారాయన.

ఒకవేళ అమ్మ ఒడి కార్యక్రమానికి తల్లిదండ్రులు రావడంపై కోర్టు సూచనలు ఇస్తే వాటినే పాటిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబు ఏం మాట్లాడతారని.. ఒక్కసారి విజయనగరానికి వచ్చి చూస్తే.. కుప్పం కంటే తమ జిల్లా ఎంత బాగుందో ఆయనకు తెలుస్తుందన్నారు బొత్స. ఏపీ రాష్ట్ర రాజధాని విశాఖపట్నానికి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పవర్​లో ఉన్నప్పుడు ఎందుకు రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదని బొత్స క్వశ్చన్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు మంచి చేస్తుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతోందని ఆయన ఫైర్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో జగన్ సారథ్యంలో గెలిచి మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి