iDreamPost

గుడ్ న్యూస్..ఏపీలో కరోనా నుంచి కోలుకున్న మర్కజ్ యాత్రికులు

గుడ్ న్యూస్..ఏపీలో కరోనా నుంచి కోలుకున్న మర్కజ్ యాత్రికులు

కరోనా వైరస్ పై తీవ్ర ఆందోళన చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఆ మహమ్మారి పై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బందికి పెద్ద ఊరటనిచ్చే అంశం ఇది. ఢిల్లీ తబలీగ్ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారిలో వైరస్ గురైన బాధితుల్లో ఈరోజు 13 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 16 రోజుల తర్వాత వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన 13 మంది యాత్రికులను ఈరోజు అధికారులు వారి ఇళ్లకు పంపించారు.

కరోనా ఢిల్లీ లింక్ తెలిసిన తర్వాత యాత్రికులకు పరీక్షలు చేయగా పలువురి కి పాజిటివ్ అని తేలింది. అందులో 13 మందిని 16 రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వీరందరికి కడపలోని ఫాతిమా ఇన్స్టిట్యూట్ లో చికిత్స అందిస్తున్నారు. నాణ్యమైన వైద్యం, మంచి పౌష్టికాహారం అందించడంతో 16 రోజుల్లోనే వీరందరూ వైరస్ బారి నుండి బయటపడ్డారు. కరోనా ను గెలిచిన వారిలో కడప, బద్వేల్, పులివెందుల, వేంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. 13 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకోవడం తో కడపలో యాక్టివ్ కేసుల సంఖ్య 23 కు పడిపోయాయి. దీంతో జిల్లా యంత్రాంగం రెట్టించిన ఉత్సాహంతో కరోనా పై పోరాటం చేస్తోంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్తగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 534 కు చేరింది. 20 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 14 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన తొమ్మిది కేసుల్లో పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో మూడు చొప్పున నమోదయ్యాయి. 122 కేసులతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి