iDreamPost

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి మీద ఎటాక్

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటి మీద ఎటాక్

తెలంగాణ రాజకీయాల్లో అనేక సంచలన విషయాలు తెరమీదకు వస్తున్నాయి. ఏకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారు అని పోలీసులు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో మహబూబ్నగర్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత జితేందర్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అనే విషయం మీద దర్యాప్తు జరుపుతామని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. అయితే ఆయన ప్రెస్ మీట్ అయిన కొద్దిసేపటికే ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నివాసం మీద దాడి జరగడం సంచలనంగా మారింది.

తన నివాసం మీద దాడి జరిగిన విషయాన్ని ఎంపీ జితేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన ఢిల్లీ నివాసంలో కిడ్నాప్ ఘటన జరిగి కొన్ని రోజులు కూడా కాకుండానే తన మహబూబ్నగర్ నివాసం మీద దాడి చేశారని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన సిబ్బంది ఈ విషయంలో భయభ్రాంతులకు గురయ్యారు అని వెల్లడించారు. తన కారును డ్యామేజ్ చేశారు అని ఇంటిబయట టైర్లు కాల్చి భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. తాను మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నానని ఆయన వెల్లడించారు.

అయితే మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అనే వ్యక్తులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని వీరు ముగ్గురూ జితేందర్ రెడ్డి కి చెందిన ఢిల్లీ సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నట్టు తేలడంతో జితేందర్ రెడ్డి పీఏ రాజు, జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాలను కూడా అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. పోలీసులు జితేందర్ రెడ్డి పాత్ర ఉందేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడిన గంటల వ్యవధిలో ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పని ఎవరు? చేశారు? అనేది పోలీసులు తెలుస్తారేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి