iDreamPost

వ‌లంటీర్ల సేవ‌కు గుర్తింపు.. నేటి నుంచి అవార్డులు

వ‌లంటీర్ల సేవ‌కు గుర్తింపు.. నేటి నుంచి అవార్డులు

ఆగ‌ష్టు 15, 2019 ఏపీలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. స్వాతంత్ర్యదినోత్స‌వం రోజున గ్రామ వ‌లంటీర్ వ్యవస్థ మొదలయ్యింది. ఆ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో డాక్టర్లకు చేతులెత్తి నమస్కారం పెట్టేవారని.. ప్రభుత్వం అప్పగించిన పనులు చేస్తే వాలంటీర్లకు ప్రజలు నమస్కారం పెడతారని అన్నారు. అప్ప‌గించిన 50 ఇళ్లకు న్యాయం చేస్తే.. వాళ్ల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు. అందరూ యువతేనని.. జాగ్రత్తగా తమ బాధ్యతల్ని నిర్వర్తించాలని సూచించారు. జ‌గ‌న్ పేర్కొన్న‌ట్లే ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థకు అద్భుత గుర్తింపు వ‌చ్చింది. ప్ర‌ధానంగా క‌రోనా కాలంలో వాళ్లు అందించిన సేవ‌లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

ఏపీ ప్ర‌భుత్వం కూడా వాలంటీర్ల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌స్తోంది. దీంతో వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు నేను విన్నాను.. నేను ఉన్నాను అనే భ‌రోసా క‌లిగించేలా ప‌ని చేస్తున్నారు. వారి సేవ‌ల‌కు గుర్తింపుగా ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నేటి నుంచి వాలంటీర్ల‌కు అధికారులు అవార్డుల సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. కనీసం సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర క్యాటగిరిల్లో వాలంటీర్లకు అవార్డులను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది వాలంటీర్లకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. వాలంటీర్లకు పురస్కారాల కోసం రూ.258.74 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాలంటీర్ల పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. అవినీతికి తావులేకుండా కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే అందిస్తున్న వాలంటీర్లకు సీఎం జగన్ అందిస్తున్న చిరుసత్కారం ఇదని ప్రభుత్వం తెలిపింది. సేవా వజ్ర కింద రూ.30వేల నగదు, సేవారత్న కింద రూ.20వేల నగదు, సేవా మిత్ర కింద రూ.10వేల నగదు అందించనున్నారు. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది. ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే వాలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్నారు. లబ్ధిదారులు వేరే ప్రాంతాల్లో ఉన్నా వాలంటీర్లు శ్రమపడుతూ అక్కడికి వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి