iDreamPost

సీపీఎస్‌ రద్దు పై ఏపీలో క‌మిటీ

సీపీఎస్‌ రద్దు పై ఏపీలో క‌మిటీ

ఉద్యోగుల విన‌తి మేర‌కు ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దు పై వేగం పెంచింది. ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన స‌ర్కారు మ‌రింత వేగ‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది. గ‌త కేబినెట్ లో కూడా సీపీఎస్ రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి చ‌ర్చించారు. పీఆర్సీ అంశం పై ఇప్పటికే ఉన్న మంత్రి వర్గ ఉప సంఘం, అధికారులు కలిసి ఉద్యోగ సంఘాల నాయకులతో క‌లిసి సీపీఎస్ ర‌ద్దు కసరత్తు ప్రారంభించాలని జ‌గ‌న్ ఆదేశించారు. ఇప్పుడు తాజాగా సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కొత్త కమిటీ చర్చలు జరపనుంది. చర్చల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కానీ, కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతీ ఉద్యోగి జీతం నుండి కనీసం 10 శాతాన్ని పెన్షన్ స్కీమ్ కోసం కట్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్ లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడ ఉద్యోగి వేతనం నుంచి కట్ చేసేవారు కాదు.

పాత పెన్షన్ స్కీమ్ పద్దతిలోనే ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో 7 ఏళ్ళ పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30 శాతం పెన్షన్ గా చెల్లించేవారు. కానీ సీపీఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది. అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. పాద‌యాత్ర‌లో వీరి ఆందోళ‌న‌ను గుర్తించిన జ‌గ‌న్ సీపీఎస్ ర‌ద్దు కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆ హామీ అమ‌లు దిశ‌గా క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి