iDreamPost

అడవి బిడ్డలకు అలా న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ ఆలోచన

అడవి బిడ్డలకు అలా న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ ఆలోచన

జీవో నెం. 3 పై ఇటీవల సుప్రీంకోర్ట్ తీర్పు రావడంతో షెడ్యూల్ ప్రాంతాల హక్కులు హరించినట్టేనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గిరిజన సంఘాలు మన్యం బంద్ కూడా పాటించాయి. ఈ పరిస్థితుల్లో ఓవైపు న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు కొత్త చట్టం ద్వారా నష్ట నివారణకు పూనుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గిరిజనులకు ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తరుణంలో గిరిజనులకు న్యాయం చేయడానికి అవసరమైతే చట్టంలో సవరణలు చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రికి నివేదించబోతోంది.

జీవో నెంబర్.3 విషయంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసి) ప్రత్యేక సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో పాటుగా గిరిజన శాసనసభ్యులు తెల్లం బాలరాజు(పోలవరం), పీడిక రాజన్న దొర(సాలూరు), కళావతి(పాలకొండ), చెట్టి ఫాల్గుణ (అరకు), భాగ్యలక్ష్మి (పాడేరు), ధనలక్ష్మి (రంపచోడవరం), గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా తదితరులు జీవో నెంబర్.3 విషయంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి సుధీర్ఘంగా చర్చించారు. ఆ సందర్భంగా పుష్ప ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు, భాషలు, సాంప్రదాయాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్థానికులైన గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటేనే ఎక్కువ మంది గిరిజన పిల్లలు చదువుకోవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవయ్యింది. జీవో నెం. 3 తీసుకురావడానికి మూలం అదేనని సభ్యులు తెలిపారు. సుప్రీంతీర్పు తర్వాత ఇప్పటికే మూడుసార్లు సమావేశాలను నిర్వహించా మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. సుప్రీంతీర్పు ప్రకారం అప్పీల్ కి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానికి గడువు కూడా లేదని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఒకవైపు రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తూ మరోవైపున గిరిజనులకు న్యాయం చేయడం కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలలో సవరణలు చేసి, కొత్త చట్టాన్ని తీసుకువచ్చే ప్రక్రియపై కూడా కసరత్తు చేయడం జరుగుతోందని పుష్ప శ్రీవాణి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేసారు. అయితే కొంతమంది కావాలనే రాజకీయదురుద్దేశాలతో జీవో నెంబర్.3 పై అనవసరమైన రాద్ధాంతం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాగా జీవో నెంబర్.3 పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయడంతో పాటుగా ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాలలో 100శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కోరారు.

జీవో నెంబర్.3 విషయంగా న్యాయపరమైన చర్యలన్నింటినీ తీసుకోవడంతో పాటుగా గిరిజనులకు న్యాయం చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ టీఏసీ తీర్మానించింది. అంతేగాకుండా గిరిజన సమస్యలపై సీఎం చేస్తున్న కృషిని కూడా అభినందించింది. ఐటీడీఏలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు రూ.153 కోట్లను కేటాయించినందుకు అడవి బిడ్డలను ఆదుకోవడానికి తగ్గట్టుగా జీవో నెం.3 రూపంలో లభించిన ప్రయోజనాలు గిరిజనులకు దక్కేలా చేసేందుకు అనుగుణంగా కొత్త చట్టం రూపకల్పన జరగబోతున్నట్టు కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి