iDreamPost

ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్రాధాన్యత, జగన్ ప్రభుత్వ నిర్ణయంతో అభివృద్ధికి బాసట

ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్రాధాన్యత, జగన్ ప్రభుత్వ నిర్ణయంతో అభివృద్ధికి బాసట

వ్యవసాయ ఆధారిత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికరంగంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయింది. సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నప్పటికీ వినియోగం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఊరట కల్పించేలా జగన్ సర్కారు చొరవ చూపుతోంది. సముద్ర తీరం పొడవునా కొత్తగా పోర్టులు, జెట్టీల నిర్మాణం ద్వారా మత్స్యరంగం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. అదే సమయంలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లపై శ్రద్ధ పెడుతోంది. దానికి తగ్గట్టుగా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తూ యువతను ప్రోత్సహించే ప్రయత్నాలు సాగిస్తోంది.

అందులో భాగంగా ఫుడ్‌ ప్రాససింగ్‌ క్లస్టర్లపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు. తద్వారా ఆ ప్రాంతంలో సదరు ఉత్పత్తుల ఆధారంగా ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే ప్రాధమికంగా అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఆయా పంటల ఆధారంగా ఫుడ్‌ ప్రాససింగ్‌ రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలను సద్వినియోగం చేసుకుంటూ కొత్త యూనిట్ల స్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ప్రాససింగ్‌ చేసిన తర్వాత మార్కెటింగ్‌ కోసం పెద్ద పెద్ద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా మొదలయ్యాయి. మొక్కజొన్న, చిరుధాన్యాలు (మిల్లెట్స్‌), కందులు, అరటి, టమోటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడి, అవసరమైన ప్రాససింగ్‌ ప్లాంట్లపై ప్రతిపాదనలను తాజా సమీక్షలో అధికారులు సీఎం ముందుంచారు. ప్రాససింగ్‌ యూనిట్లకు దాదాపు రూ.2900 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి అంటూ కొత్తగా ఏర్పాటు కాబోయే జిల్లాకు ఒకటి చొప్పున 25 ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాట్లు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సీఎం ముందుచారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధే లక్ష్యంగా ప్రయత్నం చేయాలన్నారు. పంటలను కొనుగోలు చేసేందుకు ముందుగానే ధరలు నిర్ణయించామన్నారు. మార్కెట్లో కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందన్నారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ (వాల్యూ ఎడిషన్‌) జోడించడం చాలా ముఖ్యం కాబట్టి దీని కోసం ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సరి పడే సామర్థ్యంతో ఈ ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల ప్రాససింగ్, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక వింగ్‌ పని చేయాలని సూచించారు. ఆర్బీకేల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి. అలాగే రెండో దశ ప్రాససింగ్, మొత్తం ఈ కార్యక్రమాల కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. ఆయా యూనిట్లన్నీ కూడా అత్యంత ప్రొఫెషనల్‌ విధానంలో నడవాలని, రైతులకు అండగా నిలవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

వాటి నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. విశ్వసనీయత కలిగిన సంస్థలను పరిగణలోకి తీసుకుని ఒప్పందాలు చేసుకోవాలన్నారు

దాంతో ఏపీలో వ్యవసాయాధారిత పరిశ్రమలకు కొత్త ఊపిరి ఇస్తున్నట్టవుతోంది. పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు స్థానికంగానే పరిశ్రమల ఏర్పాటు ద్వారా పలువురికి ఉపాధి లభించే ద్విముఖ వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రణాళికలు ఆచరణ రూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఏకకాలంలో పురోగతికి అవకాశం లభిస్తుందనే ఆశాభావం సర్వత్రా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి