iDreamPost

ఈనాడు రామోజీరావుకి నేరుగా వార్నింగ్

ఈనాడు రామోజీరావుకి నేరుగా వార్నింగ్

ఏపీలో మరోసారి మీడియా వ్యవహారాలు చర్చకు వచ్చాయి. ఇది నిత్యకృత్యంగా మారుతోంది. జగన్ ప్రభుత్వంలో లోపాలను భూతద్దంలో చూపించేందుకు పడే తపన, ప్రభుత్వ వ్యవహారాలకు కవరేజ్ ఇవ్వడంలో కనిపించడం లేదు. చివరకు మంత్రులు ఇచ్చిన ప్రకటనలు కూడా ప్రచురించడానికి వెనుకాడుతుండడం విపరీత ధోరణికి అద్దంపడుతోంది. దాంతో చాలాకాలంగా వేచి చూస్తున్న మంత్రి ఆళ్ల నాని ఫైరయ్యారు. ఈనాడు తీరు మీద విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకుంటే బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కరోనా కట్టడి చర్యల్లో దేశంలోనే ఏపీ సమర్థవంతంగా పనిచేస్తోందని మోడీ సైతం ప్రశంసించారు. అదే సమయంలో ఏపీలో కరోనా విషయాన్ని కాసుల వేటకు వాడుకున్న ఆసుపత్రులన్నీ చంద్రబాబు బంధువులు, ఆత్మబంధువులవేనని ఆళ్ల నాని ఆరోపించారు. దోపిడీ కేంద్రాలుగా మారిన ఆసుపత్రుల గురించి ఈనాడు, ఆంద్రజ్యోతి ఎందుకు రాయడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు ప్రకటనలకు వత్తాసు పలికే మీడియాకు ఈ వాస్తవాలు రాయడం ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. వాస్తవాలు చెప్పాల్సిన మీడియా బాబును మోస్తూ ప్రజల్లో అవాస్తవాలు తీసుకెళుతున్నారంటూ మండిపడ్డారు. ఈ అంశంలో చంద్రబాబు చేసే అర్థం పర్థం లేని ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఇచ్చే వివరణలు ప్రచురించకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని సూచించారు.

ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తున్న వార్తల్ని ఖండిస్తూ ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి, ఓపికగా వివరణలు ఇస్తున్నా ఆ వర్గపు మీడియా స్పందించకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపు ప్రచారాలకు విరుగుడుగా ఇచ్చిన పత్రికా ప్రకటనను ప్రచురించటానికి ‘ఈనాడు’ దినపత్రిక నిరాకరించడం ఏంటని ఆయన విరుచుకుపడ్డారు. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్య్రం గురించి లెక్చెర్లు ఇచ్చే రామోజీరావు సంస్థ, చివరికి ప్రభుత్వ ప్రకటనల్లో భావం మీద కూడా తనకే హక్కు ఉందనుకుంటున్నారా అంటూ సందేహం వ్యక్తం చేశారు. వార్తపరంగా అయినా ప్రభుత్వం ఇచ్చిన వెర్షన్‌ను ప్రచురించకపోవటం.. పత్రికా స్వేచ్ఛలో భాగం కాదన్నారు. అలాంటిది ఏకంగా ప్రభుత్వ ప్రకటనను తిరస్కరించటం ఏ స్వేచ్ఛలో భాగమో, ఎవరి స్వేచ్ఛలో భాగమో వారే చెప్పాలన్నారు. ఇది రాజ్యాంగ స్వేచ్ఛకాదు… తెలుగుదేశం స్వేచ్ఛలో భాగం మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు.

గతంలో ఏనాడూ ఇంత పెద్ద ఎత్తున వైద్యరంగాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళుతున్న విషయం గుర్తు చేశారు. సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాలు చూసి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈనాడు, ఆంధ్రజ్యోతి బాధ్యతాయుతమైన పాత్రనుపోషించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంపడే కార్యక్రమాలు ఆపకపోతే, ప్రజలే తగిన బుద్ది చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని ఆళ్లనాని హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి