iDreamPost

లోక మనెమ్మ.. లోకం ప్రశంసలు అందుకుంటోంది..

లోక మనెమ్మ.. లోకం ప్రశంసలు అందుకుంటోంది..

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో మానవత్వం వెల్లివిరుస్తోంది. ఆపత్కాలంలో అన్నార్తులకు, పేదలకు సహాయం చేసేందుకు ఆస్తిపాస్తుల తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన సహాయం వారు చేస్తున్నారు. ధనవంతులు, మధ్యతరగతి ప్రజలు, పేద వారు కూడా తమ తోటి వారికి చేయగలిగిన సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సహాయం చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుండడంతో మరికొంతమంది సహాయం చేసేందుకు దోహదపడుతోంది. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా తుని లో ఒక సాధారణ మహిళ లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులపై చూపిన ప్రేమ, ఆప్యాయతలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తో రాష్ట్ర డీజీపీ ఆన్లైన్ లో మాట్లాడి సెల్యూట్ చేయడం విశేషం.

రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా తుని లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసుల వద్దకు ఓ 50 ఏళ్ల మహిళ చేతి సంచితో వచ్చింది. పోలీసులు వాకబు చేయడం ప్రారంభించారు. ఆమె తన పేరు చెబుతూనే సంచి లో నుంచి రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను బయటకు తీసింది. పోలీసులకు ఇచ్చింది. బాటిళ్లను తీసుకునే ముందు అక్కడ ఉన్న పోలీసు అధికారులు ఆమె వివరాలు అడిగారు. ఆమె చేసే పని, సంపాదన.. పై ఆరా తీశారు. తనకు నెలకు 3,500 వస్తాయని చెప్పింది. తక్కువ సంపాదన ఉన్న మీరు.. మా కోసం ఇలా తీసుకురావడం ఎందుకని, మీ కుటుంబానికి తీసుకెళ్ళండంటూ వారించారు. ఐతే లోకమనమ్మ.. నవ్వుతూనే.. మా కోసం కష్టపడుతున్న మీకు నేను ఇది మాత్రమే చేయగలను అంటూ.. కూల్ డ్రింక్ బాటిళ్లు తీసుకోవాలని కోరింది. ఆమె ఆప్యాయతను చూసిన పోలీసు అధికారులు కూల్ డ్రింక్ బాటిళ్లను స్వీకరించారు.

పోలీసులు, లోకమనెమ్మ మధ్య జరిగిన సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరలంది. నెటిజన్లు లోకమనెమ్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర డిజిపి దృష్టి కి వెళ్ళింది. ఈ రోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారులు చప్పట్లతో లోకమనెమ్మ ను అభినస్తుండగా.. డిజిపి గౌతమ్ సవాంగ్ ఆమెకు సెల్యూట్ చేశారు. మీ కోసమే మేము ఎండలో, కుటుంబాన్ని వదిలి డ్యూటీ చేస్తున్నామని, ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ సహకరించాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి