iDreamPost

శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ వరం

శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ వరం

శ్రీకాకుళం జిల్లా వరప్రదాయిని అయిన వంశధార ప్రాజెక్టు విస్తరణ ఫలాలు వేగంగా రైతులకు, ప్రజలకు అందించే ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్
ఇచ్చారు. గతంలో ఈ ప్రాజెక్ట్ రెండో దశ పనులకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేస్తే..దాని ఫలాలు అందేలా ఎత్తిపోతల పథకానికి ఆయన తనయుడు జగన్ చొరవ తీసుకోవడం విశేషం. ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులు లేక ఒక పంట వేయడానికే శ్రీకాకుళం జిల్లా రైతులు నానా అగచాట్లు పడేవారు. వంశధార ప్రాజెక్ట్ మొదటి దశ పనులు పూర్తి కావడంతో దాని పరిధిలోని ఆయకట్టులో రెండు పంటలు పండించుకునే వెసులుబాటు కలిగింది. జిల్లాలోని చివరి ప్రాంతం వరకు వంశధార జలాలు అందాలంటే రెండోదశ ప్రాజెక్ట్ పనులు జరగాలి. కానీ ఒడిశా అభ్యంతరాలతో రెండోదశ పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

వైఎస్ హయాంలో హిరమండలం రిజర్వాయర్

2004లో వైఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు వంశధార ప్రాజెక్టు ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఆ మేరకు న్యాయ, అంతర్రాష్ట్ర వివాదాలున్న నిర్మాణాలను విడదీసి వంశధార పేజ్ 2 స్టేజి 2 కింద హిరమండలం రిజర్వాయర్ పనులను వైఎస్ చేపట్టారు. సుమారు రూ.1600 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ రిజర్వాయర్లోకి నీటిని మళ్లించాల్సిన నేరడీ బ్యారేజ్ నిర్మాణం మాత్రం ఒడిశా అభ్యంతరాలు, వంశధార ట్రిబ్యునల్ విచారణ వల్ల ప్రారంభం కాలేదు. గత టీడీపీ హయాంలో దానిని అసలు పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ నేరడి నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. ఆ మధ్య ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో దీనిపై చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించి చర్చలద్వారా సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారుల బృందాన్ని నియమించారు. మరోవైపు ఈ వివాదంపై విచారణ జరిపిన వంశధార ట్రిబ్యునల్ కూడా బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.

సత్వర ప్రయోజనానికి లిఫ్ట్

అయితే ఒడిశాతో వివాదం పరిష్కారమై, నేరడి బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడానికి మరి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. అంతవరకు ఆగకుండా హిరమండలం రిజర్వాయర్ ను సత్వరం వినియోగంలోకి తెచ్చేలా మాజీమంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నీటిపారుదల రంగ నిపుణులతో మాట్లాడి ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ప్రతిపాదన గురించి సీఎం జగన్ కు లేఖ రాయడంతోపాటు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్వయంగా కలిసి వివరించారు. వైఎస్ హయాంలో నిర్మించిన హిరమండలం రిజర్వాయరులోకి 19.5 టీఎంసీల నీటిని సత్వరం మళ్లించి సాగునీటి అవసరాలు తీర్చాలంటే గొట్టా బ్యారేజ్ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.300 కోట్ల ఖర్చు అవుతుంది. ఒక్క ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేసి రిజర్వాయర్లోకి నీటిని ఎత్తి పోయవచ్చు. తద్వారా ఖరీఫ్ లో 2.50 లక్షల ఎకరాలకు, రబీలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, ఉద్దానం ప్రాంత తాగునీటి అవసరాలు కూడా తీర్చవచ్చు. అలాగే త్వరలో నిర్మించనున్న భవనపాడు ఫిషింగ్ హార్బర్ నీటి అవసరాలు కూడా తీర్చవచ్చు. ఎత్తిపోతల పథకం ప్రతిపాదన పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించి ప్రస్తావించి.. దానికి సంబంధించి సర్వే జరిపి సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి